YSR Rythu Bharosa: వైఎస్సార్ రైతుభరోసా పథకం రైతుల గమనాన్నే మారుస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఖరీఫ్. రబీలకు సాగు ప్రోత్సాహం అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. తరచూ సీఎం జగన్ చెప్పే మాటలివి. కానీ అది వాస్తవం కాదని తేలిపోయింది. సోమవారం రైతుభరోసా పథకం మంజూరులో లబ్ధిదారుల్లో భారీగా కోత విధించింది. దాదాపు 80 లక్షల మంది రైతులు ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించినా.. లబ్ధిదారుల సంఖ్య మాత్రం 50.10 లక్షలకు పడిపోయింది. ఇందులో భూమి ఉన్న రైతు కుటుంబాలు 47.85 లక్షలు కాగా, అటవీ భూమి హక్కుదారులు 92 వేల మంది, కౌలు రైతులు లక్షా 43 వేల మందికే రైతు భరోసా వర్తింపచేస్తోంది. 2021-22లో 52.38లక్షల మందికి రైతు భరోసా ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి ఆ సంఖ్య 50.10లక్షలకు తగ్గింది. అంటే… ఏడాదిలో 2.28లక్షల మందికి భరోసా లేకుండా చేసింది. వీరిలో 1.43 లక్షల మంది కౌలు రైతులే అని అధికారిక గణాంకాల ద్వారానే తెలుస్తోంది.
వైసీపీ అధికారంలోకి వస్తే ఒక్కో రైతుకు రూ.12,500 పెట్టుబడి సహాయం అందిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చివరికి… కేంద్రం ఇచ్చే ఆరు వేలతో కలిపి రూ.13,500 వేలు మాత్రమే ఇస్తున్నారు. కానీ… ఈ మొత్తం డబ్బులను తామే ఇస్తున్నట్లుగా సోమవారం ఆర్భాటపు ప్రకటనలు జారీ చేశారు. దీనికోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ‘పీఎం కిసాన్ యోజన’ కింద కేంద్ర ప్రభుత్వం ప్రతి నాలుగు నెలకోసారి రూ.2వేల చొప్పున చెల్లిస్తుంది.
Also Read: Gautam Adani: అదానీ ప్రపంచంలోనే కుబేరుడిగా ఎందుకు ఎదుగుతున్నాడు? ఇంత డబ్బు ఎక్కడిది?
రాష్ట్ర ప్రభుత్వం మే నెలలో రూ.5500, అక్టోబరులో రూ.2వేల చొప్పున విడుదల చేస్తుంది. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.5500లకు ముఖ్యమంత్రి జగన్ బటన్ నొక్కారు. ఈ నెలాఖరుకు కేంద్రం రూ.2 వేలు జమ చేస్తుంది. కానీ… ఈ రెండువేలను కూడా కలుపుకొని రూ.3758 కోట్లు తామే ఇస్తున్నట్లు గొప్పలకు పోయారు. కేంద్రం అమలు చేసే ‘పీఎం కిసాన్ సమ్మాన్ యోజన’ కౌలు రైతులకు వర్తించదు. వారికి కూడా ‘రైతు భరోసా’ అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. చివరికి… మొండిచెయ్యి చూపించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో కౌలు రైతులు 15.37లక్షల మంది ఉన్నట్లు అంచనా. ఇచ్చిన మాట ప్రకారం… వీరందరికీ రైతు భరోసా వర్తింప చేయాలి. కానీ… ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అమలు చేస్తున్నారు. ఈసారి వారికి కూడా ‘కోతలు’ పెట్టారు. 2.28 లక్షల మందికి ‘రైతుభరోసా’లో కోత పడగా, అందులో 1.43 లక్షల మంది అచ్చంగా కౌలు రైతులే కావడం గమనార్హం. అంటే… కేంద్ర సహాయం అందని, పూర్తిగా తాను భరించాల్సిన భారాన్ని జగన్ తగ్గించుకున్నారన్న మాట!
‘రైతు భరోసా’లో కోతలకు కారణమేమిటో ప్రభుత్వం అధికారికంగా చెప్పడంలేదు. భూమి ఖాతా ఉన్న రైతు చనిపోయినా, లబ్ధిదారులు జీఎస్టీ, ఆదాయపన్ను చెల్లిస్తున్నా, ఒకే రేషన్ కార్డులో ఇద్దరు రైతులు ఉన్నా, రైతు కుటుంబంలో ఉన్నత విద్య చదువుతున్నా, నవరత్నాల్లోని పథకాల ద్వారా లబ్ధి చేకూరుతున్నా… రైతు భరోసాను నిలిపివేసినట్లు తెలిసింది. దీని ఫలితంగానే ఈ ఏడాది 2.28లక్షల రైతు కుటుంబాలు ‘భరోసా’కు దూరమయ్యాయి. ‘మీట నొక్కిన వెంటనే రూ.5500 రైతుల ఖాతాల్లో జమ అవుతాయి’ అని సీఎం జగన్ ఏలూరు జిల్లా సభలో పేర్కొన్నారు. ఆ మీట నొక్కినప్పటి నుంచి రైతులు డబ్బులు జమ అయినట్లు వచ్చే మెసేజ్ కోసం చూస్తూనే ఉన్నారు. కానీ… రాత్రి ఏడు గంటల తర్వాతే డబ్బులు రావడం మొదలైంది. అందులోనూ… సోమవారం 20 నుంచి 30 శాతం మందికి మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు… లబ్ధిదారుల్లోని 1.33 లక్షల కౌలు రైతుల్లో ఒక్కరికీ డబ్బులు పడలేదు. వీరు కొన్ని రోజులు వేచి చూడాల్సిందేనని అధికారులు చెబుతున్నారు. నిజానికి… కేంద్ర పథకం వీరికి వర్తించదు కాబట్టి, రాష్ట్రమే రూ.7500 జమ చేయాలి. కౌలు రైతులకు సంబంధించి జగన్ మీట నొక్కింది రూ.7500లకా, లేక రూ.5500లకా అనే అంశంపై స్పష్టత లేదు. ఆ సంగతి పక్కనపెడితే… అసలు వారి ఖాతాలో సోమవారం రూపాయి కూడా పడలేదు.
Also Read:Jagan Govt Shocks Anganwadis: అంగన్ వాడీలకు జగన్ సర్కారు షాక్..సంక్షేమ పథకాలు కట్