Homeజాతీయ వార్తలుఅయోధ్యలో రూ.1000 కోట్ల రామాలయం నిర్మాణానికి నిధులు ఎలా వస్తున్నాయి?

అయోధ్యలో రూ.1000 కోట్ల రామాలయం నిర్మాణానికి నిధులు ఎలా వస్తున్నాయి?

Ayodhya Rama Mandir

అయోధ్య.. శ్రీరాముడు పుట్టిన దివ్యక్షేత్రం. ప్రతి హిందువు ఒక్కసారైనా ఆ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలని దేశంలో కోరుకునే ప్రాంతం. ఇన్నాళ్లు బాబ్రీ మసీదు గొడవల్లో ఇరుక్కుపోయిన ఆ ప్రదేశాన్ని బీజేపీ సర్కార్ ఎలాగోలా సాధించింది. ఇప్పుడు శ్రీరాముడి ఆలయ నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన కూడా చేశారు. ఈ క్రమంలోనే 1000 కోట్ల శ్రీరాముడి ఆలయాన్ని ఎలా నిర్మిస్తారు? దానికి నిధులు ఎలా వస్తాయి? అసలు కథేంటి అన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దీనిపై స్పెషల్ ఫోకస్

Also Read: అమ్మ మాటే శాసనం.. రాహుల్ కే కాంగ్రెస్ పగ్గాలు..!

అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని ‘శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ నిర్మిస్తోంది. అయితే ఈ దేవాలయం నిర్మాణానికి ప్రభుత్వ నిధులను ఉపయోగించట్లేదని ఆలయ ట్రస్ట్ ప్రకటించింది. ఇందుకోసం రామభక్తులు, అనుచరుల నుంచి ఆర్థిక సహాయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.

అయోధ్య ఆలయ నిర్మాణమనేది భగవంతుడి సేవ అని, ఈ పనిలో డబ్బు అడ్డంకిగా రాకూడదని ట్రస్ట్ గొప్ప ప్లాన్ చేసింది. 10 రూపాయలవి 4 కోట్ల కూపన్లు, 100 రూపాయలవి 8 కోట్ల కూపన్లు, 1000 రూపాయలవి 12 లక్షల కూపన్లు ముద్రించనున్నారు. వీటన్నిటికీ రశీదు ఇస్తారు. ఈ కూపన్లన్నింటినీ ప్రజలకు పంచిపెట్టడం ద్వారా రామ మందిర నిర్మాణానికి 960 కోట్ల రూపాయలను జమ చేస్తారు.

ఈ విధంగా సేకరించిన సొమ్మును దేశంలోని మూడు పెద్ద బ్యాంకులు..స్టేట్ బ్యాక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలలో జమ చేస్తారు. భారతదేశంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 22 వేల శాఖలున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాలకు వరుసగా 14వేల శాఖలు, 10వేల శాఖలు ఉన్నాయి. అంటే మొత్తం 46 వేల శాఖలనుంచీ మొత్తం దేశాన్ని కవర్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

విదేశాలనుంచీ వచ్చే నిధికి సంబంధించి వేరే చట్టం ఉంటుంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్ఏ) అంటారు. ఈ చట్టం కింద రిజిస్టర్ చేసుకోవాలంటే ట్రస్ట్‌కు సంబంధించిన మూడేళ్ల ఆడిట్ పత్రాలు సమర్పించాలనే నిబంధన ఉంది.

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆలయ నిర్మాణానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ఇప్పుడు సొంతంగా ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి నిపేంద్ర మిశ్రాను అధ్యక్షుడిగా నియమించింది. నిధుల ఖాతాలను నిర్వహించడానికి ప్రత్యేకంగా ఒక ఆడిటర్ జనరల్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఆలయ ట్రస్ట్ కోసం టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ కంపెనీని ప్రోజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టంట్‌గా నియమించారు.

ప్రస్తుతం ఆలయ పునాదులపై దృష్టి పెడుతున్నారు. అయోధ్యలోని భూమికి 60 మీటర్ల అడుగున ఇసుక ఉంది. ఈ ఇసుక రాళ్ల బరువును ఎలా మొయ్యగలదు అనే విషయమై ఆలోచిస్తున్నారు.

Also Read: రైతు చట్టాలను చదవండి.. దేశ ప్రజలకు లేఖ షేర్ చేసిన మోడీ

మందిర నిర్మాణానికి రాజస్థాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలో బన్సీ పహార్పూర్ గ్రామానికి చెందిన రాయి అవసర పడుతుంది. అక్కడి రాయి లేత గులాబీ రంగులో చాలా అందంగా ఉంటుంది. ఈ రాతి మీద చెక్కడం చాలా సులభం. ఇంతకుముందు, మందిరం కోసం ఈ రాళ్లపైనే చెక్కారు. కానీ, ఇప్పుడు అనేక కారణాల వల్ల ఆ ప్రాంతాన్ని అటవీ ప్రాంతంగా ప్రకటించారు.

అయోధ్యలో నిర్మించబోయే మందిరం ప్రపంచంలోనే అతి సుందరమైన ఆలయంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అతి త్వరలోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేసి భక్తులకు దర్శనం కల్పించాలని ఆలోచిస్తోంది. అందుకుగానూ ఇప్పటినుండే కేంద్రం కసరత్తులు మొదలుపెట్టింది. 2024లోపు ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉన్నట్లు తెలుస్తుంది. 2024-25 లోపు రామమందిరాన్ని పూర్తి చేసి ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆలోచనతో కేంద్ర ఉన్నట్లు వివిధ వర్గాలు భావిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే రానున్న ఐదేళ్ళల్లో రామమందిర నిర్మాణమే కేంద్రం టార్గెట్ గా పెట్టుకుందని తెలుస్తుంది. పగలు.. రాత్రి.. అనే తేడాలేవి లేకుండా పని చేసి రామమందిర నిర్మాణాన్ని చకచకా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉంది.

నిర్మాణానికి కావలసిన రాతి స్తంభాలు 50 శాతం సిద్ధంగా ఉన్నాయంటూ కొందరు తెలిపారు. మిగతా యాభై శాతం స్తంభాలను కూడా అతి త్వరలోనే పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో.. రామమందిరమే ప్రధాన ఎజండాగా మోడీ ప్రచారంలోకి దిగానున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

-నరేశ్

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular