PM Modi- Opposition: ఉచిత పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా పరిణమిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితాలను కట్టడి చేయాలని సుప్రీం కోర్టులో కూడా పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఉచితాలపై సుదీర్ఘ చర్చ జరగాలని సూచించింది. ఏది ఉచితం.. ఏది సంక్షేమం అనేది తేల్చాలని అవసరం ఉందని అభిప్రాయపడింది. ఉచితాలను నియంత్రించాల్సిన బాధ్యత కూడా రాజకీయ పార్టీలకే ఎక్కువగా ఉందని తెలిపింది. ఈ క్రమంలో విపక్షాలు ఈ ఉచితాలనే మోదీని ఓడించేందుకు బ్రహ్మాస్త్రంగా మార్చుకుంటున్నాయి. ఏ ఉచితాలైతే మోదీ వద్దంటున్నారో.. ఆ ఉచితాలే ఇస్తామని చెప్పి ప్రజల ఓట్లు పొందాలని భావిస్తున్నాయి. ఈ మేరకు వారు ప్రకటనల్లో కాకుండా కార్యాచరణలో ఈ విషయాన్ని బయట పెట్టేస్తున్నారు.

బీజేపీకి.. విపక్షాలకు మధ్యే పోటీ..
దేశంలో వచ్చే ఎన్నికలు బీజేపీకి, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ఉంటుందని ఎవరూ భావించడం లేదు. ప్రస్తుత సమీకరణలు చూస్తే వచ్చే ఎన్నికలు బీజేపీ, విపక్ష కూటమి మధ్య జరిగే అవకాశం కనిపిస్తోంది. ఒంటరిగా మోదీని ఢీకొట్టే నేతలు కనిపించడం లేదు. ఈ క్రమంలో ఉచిత అస్త్రంతోనే మోదీని దెబ్బకొట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. అన్ని పార్టీలు రాష్ట్రాలు.. కేంద్ర స్థాయిల్లో ఉచితాల వరద పారించి మోదీని, బీజేపీని కట్టడి చేయాలని భావిస్తున్నాయి.
గుజరాత్ నుంచే బోణీ..
మోదీ, బీజేపీ దూకుడుకు ఉచితాలతో కళ్లెం వేయాలని చూస్తున్న విపక్షాలు.. త్వరలో జరిగే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచే కార్యాచరణ అమలుకు సిద్ధమవుతున్నాయి. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘంగా అధికారం అందని చరిత్ర. గత ఎన్నికల్లో కాస్త గెలుపు దగ్గరకు వచ్చినా.. దూరంగానే ఉండిపోవాల్సి వచ్చింది. ఒకప్పుడు గుజరాత్ కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిదే. సరైన నాయకుడు లేవకపోవడమే కాంగ్రెస్‌కు లోటు. ఈ సారి కూడా అలాంటి సమస్య ఉంది. కానీ అటువైపు మోడీ ఉన్నారు . అందుకే రాహుల్ మోదీకి పోటీగా ఉచితాల హామీలను తెరపైకి తెచ్చారు. రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్‌తో ప్రారంభించి.. రైతులకు రూ.మూడు లక్షల రుణమాఫీతోపాటు లెక్కలేనన్ని ఉచిత పథకాలు ప్రకటించారు. ఇవి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. గుజరాత్ ప్రజలకు ఇవి చాలా కొత్తవే. కాంగ్రెస్ ఈ ఉచితాల విషయంలో ఉదారంగానే ఉంటోంది. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ హామీలిస్తోంది. జాతీయ స్థాయిలో ఇవే హామీలిస్తే.. సామాన్యుల్నీ ఆకట్టుకునే అవకాశం ఉంది.
ఆప్ దీ ఉచితాస్త్రమే..
కొత్త రాజకీయం చేస్తామని వచ్చిన కేజ్రీవాల్ కూడా మోడీని కట్టడి చేయడానికి ఉచితాస్త్రాలనే నమ్ముకుంటున్నారు. పంజాబ్‌లో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉన్నా.. 300 యూనిట్ల వరకూ కరెంట్ ఉచితం అని ప్రకటించారు. అమలు ప్రారంభించారు. ఆమ్ ఆద్మీ చాలా వరకూ ఉచిత పథకాల హామీలిచ్చింది. అవన్నీ అమలు చేయాల్సి ఉంది. వాటినే ఇతర రాష్ట్రాల్లోనూ ఇస్తోంది. ప్రజలు తమ వైపు ఆకర్షితులయ్యేలా చూసేందుకు అన్ని ప్లాన్లు అమలు చేసుకుంటోంది. ఈ క్రమంలో త్వరలో జరిగే గుజరాత్ ఎన్నికల్లోనూ ఉచితాస్త్రాన్ని ప్రయోగించేందుకు లెక్కలు వేసుకుంటోంది. అందరికంటే ముందే గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్ విద్యుత్ సబ్సిడీ, వంటగ్యాస్ ధర తగ్గింపు, ఉచిత విద్య, వైద్యంపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, పంజాబ్‌లో ఈ హామీలే ఆప్‌ను అధికారంలోకి తెచ్చాయి. ఢిల్లీలో రెండోసారి విజయానికి కారణమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లోనూ బీజేపీని దెబ్బకొట్టాలంటే ఇవే బ్రహ్మాస్త్రాలని ఆప్ భావిస్తోంది.

ఉచితాలకు వ్యతిరేకంగా మోదీ∙క్యాంపెయిన్..
ప్రధాని మోడీ ఇటీవలికాలంలో ఉచితాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఉచితాలతో దేశానికి నష్టమని అంటున్నారు. అయితే విపక్షాలు మాత్రం ఎదురుదాడికి దిగి అవే హామీలిస్తున్నాయి. ఇవే ఇప్పుడు మోదీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేలా చేస్తున్నాయి. ఉచితాలపై తమ ప్రభుత్వం వ్యతిరేకత విధానంతో.. మోదీ స్వయంగా ప్రకటనలు చేసినందున కాంగ్రెస్, ఆప్ వంటి పార్టీలు ఇస్తున్న హామీలతో వాటికి మైలేజ్ పెరుగుతోంది. మోదీకి తగ్గుతోంది. ఇప్పుడు తన మాటలను కాదని.. ఆయన ఉచితాలను ప్రజలకు ప్రకటిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది భారత ఓటర్లు ఉచిత హామీలను కాదనుకునే పరిస్థితి లేదు. దీన్ని మార్చాలని మోదీ అనుకుంటున్నారు. మార్చగలిగితే మోదీకి తిరుగుతుండదు.. ఒక వేళ ప్రజలు ఉచితాలకే ఓటు వేస్తే.. మొదటికే మోసం వస్తుంది. మరి విపక్షాల ఉచితాస్త్రాలపై మోదీ ఎలాంటి అస్త్రం సంధిస్తారన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది.
Also Read:Jr NTR: సినిమాలు స్టాప్.. ఎన్టీఆర్ ఆ సర్జరీకి వెళ్ళబోతున్నాడని షాకింగ్ రూమర్స్.!