
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ కౌంటర్ ను దాఖలు చేశారు. గత వారంలో ఈ కేసుపై జరిగిన విచారణలో ధర్మాసనం ఎస్.ఈ.సి కనగరాజ్ కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశించడంతో ఆయన సోమవారం కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో దాఖలైన నిమ్మగడ్డ పిల్ తో పాటు మొత్తం 12 పిల్స్ కు ఒకే కౌంటర్ ను ఎస్.ఈ.సి కనగరాజ్ దాఖలు చేయడం జరిగింది. ఓటరు లేక అభ్యర్థి కాకుండా ఎస్ఈసీ అర్హతపై రిట్ ఎలా దాఖలు చేస్తారని కౌంటర్ లో ప్రశ్నించారు. గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్ ను పిటిషనర్లు ప్రశ్నించలేరన్న స్పష్టం చేశారు. ఎన్నికల కమిషనర్ నియామకం, సర్వీస్ రూల్స్ గవర్నర్ పరిధిలోనివేనని పేర్కొన్నారు. చట్టంలో మార్పులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పదవి కోల్పోయారని తెలిపారు.
నిమ్మగడ్డను ప్రభుత్వం తొలగించలేదని, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా కోసం నిమ్మగడ్డ ఎవరినీ సంప్రదించలేదని తెలిపారు. ఎస్ఈసీ పై చర్యలు తీసుకునేందుకు గవర్నర్ కు విచక్షణాధికారం ఉందన్నారు. గవర్నర్ నిబంధనలు ఉల్లంఘిచారనడం సరికాదని కౌంటర్ లో పేర్కొన్నారు.