Sharmila: తెలంగాణ కోడలిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల రాజ్యాధికారమే లక్ష్యంగా ‘ప్రజా ప్రస్థానం’ పేరుతో పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. మొన్నటి వరకు ఆత్మహత్యలకు పాల్పడిన నిరుద్యోగుల ఇంటింటికీ వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. నిరహార దీక్షలు సైతం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లను తూటాల్లాంటి మాటలతో విమర్శల వర్షం కురిపించారు. ఖమ్మం ఖిల్లాలో మొదలైన షర్మిల పొలిటికల్ వార్ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సాగించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
వారికి కలిసొచ్చింది.. మరి షర్మిలకు
ఒకప్పుడు తండ్రి వైఎస్సార్, 2019 ఎన్నికల్లో అన్న వైఎస్ జగన్ కూడా పాదయాత్రను నమ్ముకుని ప్రజల మనసుల్లో స్థానం సంపాదించారు. అదే వారినే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. ప్రస్తుతం అదే బాటలో వైఎస్ షర్మిల నడుస్తున్నారు. వైఎస్సార్సీపీ పార్టీకి మద్దతు ఉన్న ఖమ్మం జిల్లా వేదికగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల తెలంగాణలో రాజకీయ యుద్ధానికి తెరలేపారు. అందుకోసం పాదయాత్రను ప్రధానాస్త్రంగా మార్చుకున్నారు.
తండ్రి బాటలో తనయ…
గతంలో వైఎస్ కూడా రంగారెడ్డి జిల్లాలోకి చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి సీఎం అయ్యారు. అదే లక్ష్యంతో షర్మిల కూడా గత అక్టోబర్ 20న చేవెళ్లలో ప్రారంభించిన పాదయాత్ర 21 రోజుల పాటు 238 కిలోమీటర్ల మేర సాగింది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన షర్మిల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా పాదయాత్ర వాయిదా పడిన.. ఈనెల 17న షర్మిల పుట్టిన రోజు సందర్భంగా పాదయాత్రను తిరిగి ప్రారంభించేందుకు సమాయత్తం అవుతున్నారు.
దాదాపుగా 6 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 150 గ్రామాల్లో షర్మిల పాదయాత్ర సాగింది. ఎమ్మెల్సీ కోడ్ కారణంగా నవంబర్ 11న నల్గగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం కొండపాకగూడెంలో ఆమె పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
ఈనెల 17నుంచి ప్రజా ప్రస్థానం మళ్లీ మొదలు..
ఈనెల 17న షర్మిల పుట్టినరోజు. దీంతో ఆమె ఎక్కడ అయితే తన పాదయాత్రను ఆపారో తిరిగి అక్కడి నుంచే మళ్లీ ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్టు పాదయాత్ర కోఆర్డినేటర్ చంద్రహాసన్ రెడ్డి వెల్లడించారు. తర్వాత పాదయాత్ర మొత్తం రైతుల కోసం, ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలనే డిమాండ్ తో సాగుతుందన్నారు. ఈ పాదయాత్ర మాత్రం చాలా పకడ్బందీగా సాగనున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇందుకోసం రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్ కిషోర్ సాయం తీసుకోనున్నారట..
Also Read: T Congress: వారిద్దరు ‘చేయి’ కలిపినట్లేనా?
ప్రజలు అక్కున చేర్చకుంటారా..
ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టుగా సాగిన పాలిటిక్స్.. ప్రస్తుతం బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారిపోయాయి. సీఎం కేసీఆర్ కూడా కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేసి బూతుపురాణం స్టార్ట్ చేశారు. ప్రజలంతా ప్రతిపక్షంగా బీజేపీ అనే గట్టిగా నమ్ముతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో షర్మిల పాదయాత్ర చేసినా ప్రజలు ఆమెపై పెద్దగా ఆసక్తి చూపించకపోవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఒకప్పుడు ఆంధ్రాపాలన వద్దనే కొట్లాడి మరి తెలంగాణ తెచ్చుకున్న ప్రజలు మళ్లీ రాష్ట్రాన్ని ఆంధ్రా నాయకుల చేతిలో పెడుతారా? అని షర్మిల ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుందని కామెంట్స్ చేసేవారు లేకపోలేదు.
Also Read: Paddy Grain Procurement: వరిధాన్యం కొనుగోళ్ల వివాదంలో తప్పెవరిది..? కేంద్రానిదా..? రాష్ట్రానిదా..?