National Surveys On AP: జాతీయ సర్వేల్లో విశ్వసనీయత ఎంత.. ఏపీలో ఇది నిజం అవుతా

టైమ్స్ నౌ సర్వేను ఒకసారి పరిశీలిద్దాం. ఇదే సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మూడుసార్లు సర్వేలను వెల్లడించింది. అన్నింటిలోనూ వైసీపీకి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టింది.

Written By: Dharma, Updated On : October 3, 2023 12:32 pm

AP Survey

Follow us on

National Surveys On AP: ఉగాది నాడు రాజకీయ పార్టీలు చెప్పించుకునే పంచాంగ శ్రవణాలకు, ఎన్నికల సర్వేలకు పెద్దగా తేడాలు కనిపించడం లేదు. ఎవరి పంచాంగం వారిదే అన్నట్టు.. ఎవరి సర్వేలు వారివే అన్నట్టు మారుతున్నాయి. ఇప్పుడు సర్వేలు సైతం రాజకీయ వ్యూహంలో భాగంగా మారిపోయాయి. ఎవరి డప్పు వారు కొట్టుకున్న మాదిరిగా తయారయ్యాయి. ఏపీలో ఇటీవల విడుదలైన రెండు సర్వేలు విరుద్ధ ఫలితాలను వెల్లడించాయి. జాతీయ మీడియా అయిన టైమ్స్ నౌ సర్వేలో వైసిపి ప్రభంజనం అని తేలింది. ఏపీలో 25 ఎంపీ స్థానాలు గాను.. అన్ని సీట్లు వైసిపి యే దక్కించుకుంటుందని టైమ్స్ నౌ తేల్చేసింది. ఇక ఆత్మసాక్షి అనే సంస్థ సర్వే ఫలితాలను వెల్లడించింది. తెలుగుదేశం, జనసేన కూటమి అద్భుత విజయం దక్కించుకుంటుందని తేల్చింది. వైసిపి 43% ఓట్లు దక్కించుకుంటుందని.. టిడిపి, జనసేన కూటమి 54 శాతం ఓట్లు దక్కించుకుంటాయని సర్వేలో తేల్చింది.

టైమ్స్ నౌ సర్వేను ఒకసారి పరిశీలిద్దాం. ఇదే సంస్థ ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు మూడుసార్లు సర్వేలను వెల్లడించింది. అన్నింటిలోనూ వైసీపీకి ఏకపక్ష విజయాన్ని కట్టబెట్టింది. అయితే ఈ సర్వే సంస్థ మూలాలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా టైమ్స్ నౌ సంస్థ ఏపీ సర్కార్ ప్రచార బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. యాట ఇందుకుగాను ఐదు కోట్ల రూపాయలు ముట్ట చెబుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు జగన్ సర్కార్ సదరు సంస్థకు 25 కోట్లు సమర్పించుకున్నట్లు వ్యతిరేక మీడియా ఆరోపిస్తోంది. అందుకే ఏకపక్ష విజయాలను కట్టబెడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో ఉన్న అన్ని లోక్సభ స్థానాలను వైసీపీ దక్కించుకుంటుందన్నది టైమ్స్ నౌ సంస్థ సర్వే సారాంశం. అయితే అది సాధ్యమా? అంటే మాత్రం కాదనే సమాధానం వినిపిస్తోంది. గత ఎన్నికల మాదిరిగా జగన్కు అనుకూలమైన వాతావరణం లేదని విశ్లేషణలు వెలబడుతున్నాయి. ఇటువంటి తరుణంలో 25 లోక్సభ స్థానాలు ఆ పార్టీ దక్కించుకుంటుందని చెబుతుండడం మాత్రం వాస్తవ విరుద్ధమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆత్మసాక్షి సంస్థ ఏపీలో టిడిపి, జనసేన ఓటమి అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంటుందని తేల్చింది. 54% ఓట్లతో మంచి మెజారిటీ సాధిస్తుందని చెప్పుకొస్తుంది. రెండు సంవత్సరాల కిందట ఇదే ఆత్మ సాక్షి సర్వేలో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని తేలింది. ఇప్పుడు మరోసారి తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫలితాలు ఇవ్వడం విశేషం. వైసీపీకి 43% ఓట్లు, టిడిపికి 44, జనసేనకు 10% ఓట్లను ఈ సర్వే కట్టబెట్టింది. తెలుగుదేశం,జనసేన మధ్య పొత్తు కుదిరిన నేపథ్యంలో ఓటు శాతం పెంచుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. చంద్రబాబు అరెస్టు తరువాత సానుభూతి పెరిగిందని.. దాని ఫలితంగానే ఈ కూటమి వైపు ప్రజలు మొగ్గు చూపినట్లు స్పష్టం చేసింది. అయితే ఆత్మసాక్షి అనేది టిడిపి అస్మదీయ సంస్థ అని వైసీపీ చెబుతోంది. అదంతా టిడిపికి అనుకూలత ఏర్పరచడానికి ఆ సంస్థ బోగస్ సర్వేలను బయటపెడుతోందని వైసీపీ లైట్ తీసుకుంటుంది.

రాజకీయ వ్యూహకర్తలు వచ్చిన తర్వాత.. ఈ సర్వేలు, అభిప్రాయ సేకరణలు పెరిగిపోయాయి. గతంలో సర్వే చేపట్టే సంస్థకు నిర్దిష్టమైన ప్రామాణికత ఉండేది. తాము ఎలా సర్వే చేసి ఫలితాలు వెల్లడించింది.. సదరు సంస్థలు బయట పెట్టేవి. గణాంకాలతో సహా వివరించేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కొన్ని మీడియా సంస్థలతో ఏజెన్సీలు ఒప్పందం చేసుకుని సర్వేలు చేస్తున్నాయి. ప్రజల నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నాయి. అయితే ఇక్కడే లెక్క తప్పుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. రాజకీయ పార్టీల ప్రలోభాలకు లొంగి ఫలితాలను తారుమారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ప్రజలు సైతం సర్వేలు, ఎగ్జిట్ పోల్స్, అభిప్రాయాల సేకరణను లైట్ తీసుకుంటున్నారు.