Siddhartha Luthra : ఎవరీ సిద్ధార్థ లూథ్రా: చంద్రబాబు స్కిల్‌ కేసులో ఎంత వసూలు చేస్తున్నారు?

ఆదివారం చంద్రబాబు కేసును వాదించేందుకు వచ్చిన ఆయనకు రూ. కోటి చెల్లిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆరోపించడం విశేషం.

Written By: Bhaskar, Updated On : September 10, 2023 8:40 pm

How much is lawyer Siddhartha Luthra charging in Chandrababu's skill case?

Follow us on

Siddhartha Luthra : స్కిల్‌ స్కీమ్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ ఏపీ సీఐడీ అధికారులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈకేసుకు సంబంధించి ఆదివారం కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. చంద్రబాబు తరఫున వాదించేందుకు సిద్ధార్థ లూథ్రా అనే న్యాయవాది ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి వచ్చారు. దీంతో ఒక్కసారిగా మీడియా అటెన్షన్‌ అటు వైపు వెళ్లింది. ఇంతకీ ఎవరు ఈ సిద్ధార్థ లూథ్రా? ఒక్క కేసుకు ఎంత తీసుకుంటారు? ఆయన నేపథ్యం ఏమిటి? అనే చర్చ మొదలయింది.

సిద్ధార్థ లూథ్రా తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడే. అనేక కేసుల్లో ఆయన వాదించారు. వైట్‌ కాలర్‌ నేరాలు, సైబర్‌ మోసాలు, క్రిమినల్‌ చట్టాలకు సంబంధించిన కేసుల్లో బలమైన వాదనలు విన్పించారు. ఇలాంటి వాటిల్లో ఆయనకు గట్టి పట్టు ఉందని సమాచారం. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తరఫున అవినీతి నిరోధక శాఖ కోర్టులో వాదనలు విన్పించేందుకు సిద్ధార్థ లూథ్రా వచ్చారు. ప్రాథమిక హక్కులు, ఎన్నికల సంస్కరణలు, క్రిమినల్‌ చట్టాలు, విధానపరమైన అంశాల్లో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు తరఫున ఆయన అనేక కేసుల్లో బలమైన వాదనలు విన్పించారు. వైట్‌ కాలర్‌ నేరాలు, సైబర్‌ మోసాలు, క్రిమినల్‌ చట్టాలకు సంబంధించిన కేసుల్లో వాదనలు విన్పించడంలో ఆయనకు గొప్ప నైపుణ్యం ఉంది.

సిద్ధార్థ లూథ్రా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయ శాస్త్రంలో డిగ్రీ చేశారు. కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో క్రిమినాలజీలో ఎంఫిల్‌ చేశారు. నోయిడీలోని ఎమిటీ విశ్వవిద్యాలయం ఆయనకు న్యాయశాస్త్రంలో గౌరవ డాక్టరేట్‌ ఇచ్చింది. ఢిల్లీ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ సభ్యుడిగా, ఇండియన్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సొసైటీ ఉపాధ్యాక్షుడిగా వ్యవహరిస్తున్నారు. రెండు ఇండియన్‌ లీగల్‌ జర్నల్స్‌ సలహా మండళ్లలో ఆయన సభ్యుడు. అంతే కాకుండా ఆయన దేశ, విదేశాల్లో న్యాయ శాస్త్రాన్ని బోధిస్తూ ఉంటారు. బ్రిటన్‌ లోని నార్తుంబ్రియా విశ్వవిద్యాలయంలో విజిటింగ్‌ ప్రొఫె సర్‌గా పని చేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ఎమిటీ విశ్వవిద్యా లయంలో హానరరీ ప్రొఫెసర్‌ కూడా

సిద్ధార్థ లూథ్రా మూడు దశాబ్ధాల నుంచి న్యాయ వాద వృత్తిని ప్రాక్టిస్‌ చేస్తున్నారు. 2007లో ఆయనకు సీనియర్‌ అడ్వకేట్‌ పదవి లభించింది. 2010 నుంచి ఆయన సుప్రీం కోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్నారు. 2012 జూలై నుంచి 2014 మే వరకు ఆయన అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా పని చేశారు. కేంద్ర, రాష్ట్రాల తరఫున ఆయన అనేక కేసుల్లో సుప్రీం కోర్టులో బలమైన వాదనలు విన్పించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పై కేంద్ర మాజీ మంత్రి, దివంగత అరుణ్‌ జైట్లీ దాఖలు చేసిన పరవు నష్టం కేసులో జైట్లీ తరఫున వాదనలు విన్పించారు. తెహల్కా కేసులో 2002లో అప్పటి రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్‌ ను లూథ్రా క్రాస్‌ ఎగ్జామిన్‌ చేశారు. ఢిల్లీ హైకోర్టులో 2004 నుంచి 2007 వరకు భారత ప్రభుత్వం తరఫున అనేక కేసుల్లో వాదనలు విన్పించారు. పాత్రికేయుడు వినయ్‌ రాయ్‌ ఫేస్‌ బుక్‌, గూగుల్‌, యాహూ వంటి సామాజిక మాధ్యమాలకు వ్యతిరేకంగా కేసు దాఖలు చేశారు. ఈ కేసులో ఫేస్‌ బుక్‌ తరఫున లూథ్రా వాదనలు విన్పించారు. వాట్సాప్‌ ప్రైవసీ పాలసీపై ఇద్దరు విద్యార్థులు దాఖలు చేసిన కేసులో కూడా ఆయన ఢిల్లీ హై కోర్టులో వాదనలు విన్పించారు.

సిద్ధార్థ లూథ్రా కోర్టుకు హాజరవాలంటే మాములు విషయం కాదు. ఆయన కోర్టుకు హాజరవ్వాలంటే ఐదు లక్షలు వసూలు చేస్తారని సమాచారం. ప్రయాణ ఖర్చులు, బస, ఇతర సదుపాయాల కోసం అదనంగా వసూలు చేస్తారు. కేసు తీవ్రత ఆధారంగా ఒక్కోసారి 15 లక్షల వరకు డిమాండ్‌ చేస్తారని సమాచారం. కాగా, ఆదివారం చంద్రబాబు కేసును వాదించేందుకు వచ్చిన ఆయనకు రూ. కోటి చెల్లిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఆరోపించడం విశేషం. చేతికి వాచీ కూడా లేని చంద్రబాబు అంత డబ్బు ఎలా చెల్లిస్తున్నారని ఆయన ప్రశ్నించారు.