TDP- Janasena Alliance: వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు అత్యంత ఆవశ్యం. టీడీపీతో పాటు చంద్రబాబుకు జీవన్మరణ సమస్యే. మరోసారి ఓటమి ఎదురైతే పార్టీకి గడ్డుకాలమే. అందుకే చంద్రబాబు తన వయసును లెక్క చేయకుండా కష్టపడుతున్నారు. అన్ని జిల్లాల్లో వరుస పర్యటనలు చేస్తున్నారు. అటు కుమారుడు లోకేష్ పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. యువగళం పేరిట జనవరి 27 నుంచి కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. 400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు నడిచేందుకు ప్లాన్ చేస్తున్నారు. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాలతో పార్టీ కేడర్ కూడా మంచి జోష్ లో ఉంది. అయితే ఇన్ని చేస్తున్న తన బలం చాలదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే పవన్ తో పొత్తుకు ప్రయత్నిస్తున్నారు. పనిలో పనిగా బీజేపీని కలుపుకొని వెళితే ఎన్నికల్లో వైసీపీ అరాచకాలను ఎదుర్కొవచ్చని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి పొత్తుకు సంబంధించి పవన్ సానుకూలమైన ప్రకటనలు చేస్తున్నారు. కానీ బీజేపీ నుంచి మాత్రం ఎటువంటి సానుకూలత, స్పష్టత లేదు. కానీ ఎన్నికల నాటికి బీజేపీ కలిసి వస్తుందని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు.

మరోవైపు జనసేనతో పొత్తు కూడా అంతా అషామాషీ కాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో 6 శాతం ఓటు షేర్ నమోదుచేసుకున్న జనసేన గ్రాఫ్.. ఈ ఎన్నికల్లో అమాంతం పెరిగిందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పైగా విద్యార్థులు, యువత పూర్తిస్థాయిలో టర్న్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే పవన్ పట్టుబిగించే అవకాశముంది. కనీసం 40 నియోజకవర్గాలను జనసేనకు కేటాయించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. అవి కూడా గత ఎన్నికల్లో జనసేన గణనీయమైన ఓట్లు సాధించిన నియోజకవర్గాలనే ఆ పార్టీ కోరుకుంటోంది. జనసేన కోరుతున్ననియోజకవర్గాల్లో టీడీపీ సిట్టింగ్ స్థానాలు ఉండడం జఠిలమయ్యే అవకాశముంది. అయితే జనసేనతో పొత్తు ఉన్నా 25 నుంచి 30 సీట్లు మాత్రమే కేటాయించే అవకాశమున్నట్టు టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

విజయవాడ నగరంలో రెండు స్థానాలను జనసేన కోరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనంలో కూడా విజయవాడ ఎంపీతో పాటు తూర్పు అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ నిలబెట్టుకుంది. కేశినేని నాని ఎంపీగా, గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. నగరంలో తూర్పు, పశ్చిమ, సెంట్రల్ నియోజకవర్గాలున్నాయి. తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు తమకు విడిచిపెట్టాలని జనసేన కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే తూర్పు నుంచి అల్ రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే రామ్మోహన్ ఉన్నారు. మరోసారి అక్కడ నుంచే పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో గద్దె రామ్మోహన్ గన్నవరం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఇప్పుడు ఆయనకు గన్నవరం పంపించి.. వైసీపీలో ఉన్న యలమంచిలి రవిని జనసేనలోకి ఆహ్వానించి పోటీచేయిస్తారన్న ప్రచారం ఉంది. పశ్చిమ నియోజకవర్గంనుంచి పోతిన మహేష్ జనసేనలో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. పొత్తులో భాగంగా ఆయన్ను పశ్చిమ నుంచి బరిలో దింపితే సునాయాసంగా విజయం సాధించే చాన్స్ ఉన్నట్టు జనసేన హైకమాండ్ భావిస్తోంది. పొత్తులపై స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ నియోజకవర్గాల జఠిలం తేలే అవకాశముంది. అయితే పొత్తు కుదిరినా అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు త్యాగం చేస్తేనే సత్ఫలితముంటుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.