2000 Notes Withdraw: 2000 రూపాయల నోటును రిజర్వ్ బ్యాంకు ఉపసంహరించుకున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో కొత్త కొత్త సందేహాలు మెదులుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ వరుస విలేకరుల సమావేశాలు నిర్వహించి సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ.. ప్రజల్లో ఇంకా కొన్ని అనుమానాలు నెలకొన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెలువరించిన సర్క్యులర్ ప్రకారం ఒక వ్యక్తి రోజుకు గరిష్టంగా ఎటువంటి రుజువులు లేకుండా 20వేల రూపాయల వరకు నోట్లను మార్చుకోవచ్చు. అలాగే ఎవరైనా 2000 రూపాయల నోట్లతో 50వేలకు మించి లావాదేవీలు నిర్వహించినట్లయితే తమ పాన్ కార్డు వివరాలు తప్పక అందించాల్సి ఉంటుంది. ఇక 2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకోవడం వల్ల చాలామంది వాటిని పెట్రోల్ బంకుల్లో మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో పెట్రోల్ బంక్ నిర్వాహకులు వాటిని అంగీకరించడం లేదు.
ఎక్కువ చేస్తే ఏమవుతుంది
2000 రూపాయల నోట్ల ద్వారా లెక్కలోకి రాని నగదు భారీగా పోగు పడిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుర్తించింది. పైగా నోట్లు రద్దు చేసినప్పుడు నగదు కొరతను నివారించేందుకు ₹2,000 నోటును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఆ నోటు ను తీసుకొచ్చి దాదాపు ఆరున్నర సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో క్లీన్ నోట్ పాలసీ లో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోటును ఉపసంహరించుకున్నట్టు తెలిపింది. అయితే ఈ నోటు రూపంలో భారీగా పన్ను పరిధిలోకి రాని నగదు జమ అయినట్టు గుర్తించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాని మూలాలు పెకిలించే పనిలో పడింది.. ఈ నోట్లను ఉపసంహరించుకున్నట్టు ప్రకటించింది. దీంతో ఈ నోట్లను భారీగా నిలువచేసిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పైగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన నాటి నుంచి వరకు బ్యాంకులు ఖాతాదారులతో పోటెత్త లేదంటే దానికి కారణం అదే అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన దానికంటే ఎక్కువ మొత్తంలో 2000 నోట్లను ఖాతాల్లో జమ చేసుకుంటే ఖచ్చితంగా ఆ వివరాలు ఆదాయపు పన్ను శాఖకు పంపిస్తామని బ్యాంకర్లు చెబుతున్నారు. అప్పుడు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపుతుంది. అప్పుడు వాటికి సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ సరైన సమాధానం చెప్పని పక్షంలో ఐటి శాఖ అధికారులు తదుపరి చర్యలు తీసుకుంటారు. పెద్ద నోట్లు రద్దుచేసి.. కొత్త కరెన్సీని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టినపుడు.. తమిళనాడు అప్పటి ముఖ్యమంత్రి జయలలిత కు సన్నిహితుడు శేఖర్ రెడ్డి భారీగా నగదును నిల్వచేశాడు. అయితే అప్పట్లో అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో వారు అతడి నగదును స్వాధీనం చేసుకుని, జైలుకు పంపించారు. ఇప్పటికీ కూడా ఆ కేసు కు సంబంధించి ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు.
నల్ల పాములను బయటికి తీసేందుకే
అయితే వచ్చే ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు భారీగా 2000 రూపాయల నోట్లు డంపు చేసినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పిన లెక్కల ప్రకారం 2000 రూపాయల నోట్లు ఆశించిన స్థాయిలో వెనక్కి రాలేదని తెలుస్తోంది. ఇలాంటప్పుడే ఆ పెద్ద నోట్ల కట్టడికి ముక్కుతాడు వేయాలనే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరణ విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. సెప్టెంబర్ 30 లోగా ఆ నోట్లు బ్యాంకులకు చేరకపోతే ఇక అవి ఎందుకూ పనికిరాని చిత్తు కాగితాలుగా మారిపోతాయి. ఒకవేళ బ్యాంకులో లెక్కకు మిక్కిలి నోట్లు జమ చేస్తే దానికి ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. ఆ ఆధారాలు ఐటీ శాఖ నిబంధనలకు లోబడి ఉంటే ఇబ్బంది ఉండదు. కానీ ఆ నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం తదుపరి చర్యలు తీవ్రంగా ఉంటాయి. మొన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ కూడా ఇదే విషయాన్ని ఉటంకించారు.
బంగారం షాపులు కిటకిట
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం తర్వాత చాలామంది 2000 రూపాయల నోట్లను బంగారం, వెండి కొనుగోలుకు వినియోగిస్తున్నట్టు తెలుస్తోంది. మరికొందరు రియాల్టీ ప్రాపర్టీలను కొనుగోలు చేసేందుకు వినియోగిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే 2000 నోట్ల ఉపసంహరణ గతంలో చేపట్టిన పెద్ద నోట్ల రద్దుకు లాజికల్ ఫాలో అప్ అని ఆర్థికవేత్తలు అంటున్నారు. 2000 కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోవాలని భారత్ తీసుకున్న నిర్ణయం ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని దెబ్బతీస్తుందని, వ్యవస్థలో పారదర్శకతను పెంచుతుందని విశ్రాంత ఆర్థికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.