Balakrishna: మాట పొదుపుగా ఉండాలి.. నోరు అదుపులో ఉండాలి అంటారు. ఇందులో ఏవి కట్టు తప్పినా మొదటికే మోసం వస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ సందర్భంలో సమాజంలో సెలబ్రిటీలుగా చెప్పుకుని తిరిగేవాళ్లు తమ ఏం మాట్లాడుతున్నారో సోయి లేకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఎదుటివాళ్ళు ఏమనుకుంటారోననే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు. వాళ్లను మోసే భజనపరులకు ఇది ఆనందం కలిగిస్తుందేమో కానీ.. చూసేవాళ్లకు ఏవగింపు అనిపిస్తుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే.. మేం చెప్పడం ఎందుకు ఆ కథ ఏమిటో మీరే చదివేయండి.
మొన్న ఎన్టీఆర్ శతజయంతిని టిడిపి క్యాంప్ అనగా చంద్రబాబు, ఆయన బామ్మర్ది బాలకృష్ణ సారథ్యంలో నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ లేకుండానే, కళ్యాణ్ రామ్ కనిపించకుండానే ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అసలు ఎన్టీఆర్ కు సంబంధం లేని వారిని కూడా ఈ కార్యక్రమానికి పిలిపించి దాన్ని ఒక ఆడియో ఫంక్షన్ లాగా చేసేసారు. సరే ఎన్టీఆర్ అంటే ఒక సినీ నటుడు, పైగా వారి కుటుంబ సభ్యుడు కాబట్టి అది వాళ్ళ ఇష్టం. అందులో తప్పు పట్టేందుకు కూడా ఏమీ లేదు. తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఎన్టీఆర్ శతజయంతి సభలో బాలకృష్ణ మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశమవుతున్నాయి. బ్లడ్ బ్రీడ్ మాటలు అలాగే ఉంటాయి అని అనుకున్నా.. అవి ఎంతకూ కొడుకుడు పడకపోవడమే ఇక్కడ ఆశ్చర్యకరం.
భారతరత్న ఇప్పించాడట
ఈ దేశంలో నిమ్న వర్గాలు ఎంతో కొంత అభివృద్ధి చెందాయి అంటే దానికి బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే కారణం. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులపాటు బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ద్రుఢ, అ ద్రుఢ సమ్మిళితమైన రాజ్యాంగం ఈ దేశంలో ఎంతోమందికి సర్వహక్కులు కల్పించింది. స్వేచ్ఛగా మాట్లాడే హక్కు నుంచి స్వేచ్ఛగా వేసే హక్కు వరకు అన్ని ప్రసాదించింది. అలాంటి అంబేద్కర్ మహాశయుడు ఈ దేశానికి చేసిన సేవలను గుర్తిస్తూ ఈ భరత జాతి ఆయనకు దేశంలోనే అత్యున్నత భారత రత్న పురస్కారం అందించి గౌరవించింది. ప్రపంచ మేధావిగా కీర్తిస్తోంది. అలాంటి రాజ్యాంగ నిర్మాతకు స్వర్గీయ ఎన్టీఆర్ భారతరత్న అవార్డు ఇప్పించాడని చెప్పడం బాలకృష్ణకే చెల్లింది.
ఎందువల్ల
బిఆర్ అంబేద్కర్ కు భారతరత్న అవార్డు ఇప్పించేంత సత్తా ఎన్టీ రామారావు కు ఉన్నప్పుడు.. ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు ఆ పురస్కారం దక్కేందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఎందుకు చొరవ చూపడం లేదు అనేదే ఇక్కడ ప్రశ్న. చంద్రబాబు నాయుడు గతంలో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వానికి సంబంధించి చక్రం తిప్పాడు. లోక్ సభ స్పీకర్ నుంచి మొదలు పెడితే దేశ రాష్ట్రపతి ఎంపిక వరకు తానే అన్నింటిలో ఉన్నానని డప్పు కొట్టుకుంటాడు. అంతేకాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు విభజిత ఏపీ ముఖ్యమంత్రిగా, భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన ఉన్నారు. 2017 వరకు ప్రధానమంత్రి తో అంట కాగారు. అలాంటి సందర్భాల్లో మరి దివంగత ఎన్టీ రామారావు కు ఎందుకు భారతరత్న పురస్కారం ఇప్పించలేకపోయారు? అంటే ఇప్పుడు జగన్ వల్ల కూసాలు కదిలిపోయాయి కాబట్టి, తాము ఎంతగా ప్రచారం చేసినా 23 సీట్ల మించి సీట్లు రాలేదు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు అవసరం పడింది. ఆయన కన్నుమూసి దాదాపు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఆయన పేరును జపం చేస్తున్నారు. ఇదే సమయంలో వారికి ఓట్లు కావాలి కాబట్టి భారతరత్న అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ మధ్యలో బాలకృష్ణ అంబేద్కర్ ప్రస్తావన తేవడమే హాస్యాస్పదంగా ఉంది. ఆ అవార్డు తన తండ్రి ఇప్పించాడని చెప్పడం మరింత జాలి కరంగా ఉంది.