Haryana Assembly Elections: ఉత్తర భారత దేశంలో కీలక రాష్ట్రమైన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. అక్టోబర్ 5న పోలింగ్, అక్టోబర్ 8న కౌంటింగ్ నిర్వహించనుంది. ఈమేరకే నామినేషన్లు స్వీకరించింది. నామినేషన్ల ఉప సంహరణ గడువు సెప్టెంబర్ 16 వరకు ఉంది. దీంతో నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తుది పోరులో ఉండే అభ్యర్థుల జాబితాను, స్వంతత్ర అభ్యర్థులకు గుర్తులను కూడా కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించింది. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత 1,031 మంది పోటీలో నిలిచారు.
1,559 మంది నామినేషన్..
హర్యాన అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి 12 వరకు ఎన్నికల సంఘం నామినేషన్ల దాఖలుకు అవకాశం కల్పించింది. 13వ తేదీన నామినేషన్లు పరిశీలించింది. సెప్టెంబర్ 16 వరకు ఉప సంహరణకు అవకాశం ఇచ్చింది. దీంతో మొత్తం 1,559 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పరిశీలన తర్వాత 1,221 మంది నామినేషన్లు చెల్లుబాటు అవుతాయని అధికారులు నిర్ధారించారు. సోమవారం(సెప్టెంబర్ 16న) ఉప సంహరణ పూర్తయ్యే నాటికి మరో 190 మంది నామినేషన్లు ఉప సంహరించుకున్నారు. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల అధికారులు మంగళవారం ప్రకటించారు. 90 నియోజకవర్గాలకు వీరు పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో ఒకే విడతలో అక్టోబర్ 5న ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 8న ఫలితాలు ప్రకటిస్తుంది.
తగ్గిన పోటీ..
ఇదిలా ఉంటే.. హర్యానా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య ఈసారి బాగా తగ్గింది. 2014 ఎన్నికల్లో 1,351 మంది పోటీ చేశారు. 2019 ఎన్నికల్లో 1,169 మంది పోటీ పడ్డారు. ఈసారి 1,031 మంది మాత్రమే బరిలో నిలిచారు. ఉప సంహరణ తర్వావత నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే.. పంచకుల నుంచి 17 మంది, అంబాల నుంచి 39 మంది, యమునానగర్ నుంచి 40 మంది, కురుక్షేత్ర నుంచి 43 మంది, కైతాల్ నుంచి 53 మంది, కర్నాల్ నుంచి 55 మంది, పానిపట్ నుంచి 36 మంది, సోనిపట్ నుంచి 65 మంది, జింద్ నుంచి 72 మంది, ఫతేహాబాద్ నుంచి 40 మంది, సిర్సా నుంచి 584 మంది పోటీ చేస్తున్నారు. హిసార్ నుంచి 33 మంది, దాద్రీ నుంచి 56 మంది, బివానీ నుంచి 56 మంది, రోహ్‌తక్ నుంచి 56 మంది, ఝజ్జర్ నుంచి 42 మంది, మహేంద్రగఢ్ నుంచి 37 మంది, రేవారి నుంచి 39 మంది, గురుగ్రామ్ నుంచి 47 మంది, నుహ్ నుంచి 21 మంది, పాల్వాల్ నుంచి 33 మంది, ఫరీదాబాద్ నుంచి 64 మంది పోటీలో ఉన్నారు.