
ఆనందయ్య మందుపై త్వరగా తేల్చాలని హైకోర్టు ఆదేశించింది. మందు కోసం జనం ఎదురుచూస్తున్నారని పేర్కొంది. వీలైనంత త్వరగా నివేదికలు తెప్పించాలని సూచించింది. ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు వల్ల కరోనా ఎలా కట్టడవుతోందనే విషయంపై ప్రచారం సాగుతున్న తరుణంలో మందు శాస్ర్తీయత, ఏవైనా దుష్ర్పభావాలు ఉన్నాయా? అనే అంశాల్ని ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.
మందు పంపిణీకి ఆదేశించాలని దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ఆనందయ్య మందుపై పరీక్షలు జరుపుతున్నామన్నారు. ఈ నెల 29 నాటకి మందుపై నివేదికలు వస్తాయని హైకోర్టుకు ప్రభుత్వం చెప్పింది.
హైకోర్టు స్పందిస్తూ ఆనందయ్య మందు కోసం ప్రజానీకం ఎదురుచూస్తున్నారని తెలిపింది. వీలైనంత వరకు రిపోర్టులు త్వరగా ఇవ్వాలని సూచించింది. మందుపై ఎవరు అనుమతి ఇవ్వాలి? అభిప్రాయాలేంటో తెలపాలని హైకోర్టు ఆదేశించింది.
ఆనందయ్య మందు వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం తన అభిప్రాయాన్ని స్పష్టం చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే తక్షణమే మందు తయారు ప్రారంభిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో కేంద్రం ఎంత త్వరగా స్పందిస్తే మందు తయారీ ఊపందుకుంటుంది. మందుపై అందరు ఎదురుచూస్తున్నారు.