https://oktelugu.com/

అమరావతి అక్రమాలపై విచారణకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

అమరావతి కేంద్రంగా అప్పటి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని జగన్‌ ముందు నుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు. అటు ఎన్నికల ప్రచారంలోనూ తాము అధికారంలోకి వస్తే అమరావతి అక్రమాలపై నిగ్గు తేలుస్తామంటూ చాలా సందర్భాల్లోనూ చెప్పారు. అధికారంలోకి వచ్చాక జగన్‌ కూడా ఆ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. అమరావతిలో అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు. Also Read: ఏంటి బాబూ విడ్డూరం: హద్దు రాళ్లను వదలని జగన్? తాజాగా.. ఈ అక్రమాలపై […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 4:17 pm
    Follow us on

    అమరావతి కేంద్రంగా అప్పటి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని జగన్‌ ముందు నుంచీ ఆరోపిస్తూనే ఉన్నారు. అటు ఎన్నికల ప్రచారంలోనూ తాము అధికారంలోకి వస్తే అమరావతి అక్రమాలపై నిగ్గు తేలుస్తామంటూ చాలా సందర్భాల్లోనూ చెప్పారు. అధికారంలోకి వచ్చాక జగన్‌ కూడా ఆ విషయాన్ని సీరియస్‌గానే తీసుకున్నారు. అమరావతిలో అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని ప్రభుత్వం తరఫున న్యాయస్థానాలను కూడా ఆశ్రయించారు.

    Also Read: ఏంటి బాబూ విడ్డూరం: హద్దు రాళ్లను వదలని జగన్?

    తాజాగా.. ఈ అక్రమాలపై విచారణ జరపాల్సిందేనంటూ హైకోర్టు కూడా ఆదేశించింది. చంద్రబాబు హయాంలో అమరావతి రాజధాని నగరం కోసం సేకరించిన భూమిలో తుళ్లూరులో పనిచేసిన ఎమ్మార్వో సుధీర్ బాబు భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు వైసీపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అప్పటి ఎమ్మార్వో మీద వచ్చిన ఆరోపణలపై సీఐడీతోనూ విచారణ జరిపిస్తోంది. అయితే తనపై విచారణ జరపకుండా సుధీర్ హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.

    హైకోర్టు ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జగన్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. విచారణ దశలో కోర్టులో జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టు చెప్పింది. అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం విచారించేటప్పుడు కోర్టుల జోక్యం తగదంటూ హితవు పలికింది. వారంలోగా ఈ కేసులో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలంటూ హైకోర్టును ఆదేశించింది.

    మరోసారి హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. దీంతో అప్పటి ఎమ్మార్వో పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సీఐడీ విచారణ జరపాలంటూ తీర్పు చెప్పింది. సుధీర్ అమరావతి ప్రాంతంలో డ్యూటీ చేసినప్పుడు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించిన భూములన్నింటినీ టీడీపీ నేతలకు దక్కేలా చక్రం తిప్పినట్లు ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ. రాజధాని కోసం భూములను ప్రభుత్వం తీసుకుంటే నష్టపరిహారం దక్కదని సుధీర్ భూ యజమానులను భయపెట్టారని అభియోగం.

    Also Read: బీజేపీ వరం: ఎన్డీయే అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌

    దాంతో ఎమ్మార్వో చెప్పిన మాటను నమ్మిన భూ యజమానులు తమ భూములను అమ్మేసుకున్నారు. ఈ అమ్మకాలన్నింటినీ సుధీర్ బాబే దగ్గరుండి జరిపించాడనేది ఆరోపణ. అందుకే ఆ భూములన్నీ టీడీపీ నేతల చేతుల్లోకి వెళ్లాయనేది ప్రభుత్వం చెబుతున్న మాటలు. ఆ తర్వాత ఆ భూములను నేతలు ప్రభుత్వానికి అప్పగించి భారీ ఎత్తు లబ్ధి పొందారనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ. ఎట్టకేలకు అమరావతి అక్రమాలపై సీఐడీ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో.. అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.