
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి.. అందులో భాగమైన అధికారులకు హైకోర్టు నుంచి మొట్టికాయలు తప్పడం లేదు. మరోసారి అక్కడి అధికారులపై హైకోర్టు ఫైర్ అయింది. ‘న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయవద్దని.. వాటిని అనుసరించాల్సిన అవసరం లేదని రాష్ట్రంలోని ఐఏఎస్, ఐపీఎల్ అధికారులకు అనధికారిక ఉత్తర్వులు ఏమైనా ఉన్నాయా..?’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. శిక్షణలో భాగంగా ముస్సోరి వెళ్లి ఏం నేర్చుకుంటున్నారని ప్రశ్నించింది. కోర్టు ఉత్తర్వులను ఎలా అమలు చేయకూడదో నేర్చుకుంటున్నారా అంటూ అసహనం వ్యక్తం చేసింది.
Also Read: జగన్ వేసిన ప్లాన్.. ఊగిపోతున్న చంద్రబాబు..
రాష్ట్రంలో 90 శాతం మంది అధికారులు తాము చట్టాలకు అతీతులం అనుకుంటున్నారని పేర్కొంది. ఓ అటెండర్‌కు కనీస టైం స్కేల్ అమలు చేయాలని ఇచ్చిన ఆదేశాలను మూడేళ్లపాటు అమలు చేయకపోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అటెండర్ చిరుద్యోగి కాబట్టి పట్టించుకోవడం లేదా అని నిలదీసింది. కోర్టుకు గైర్హాజరైన అధికారులు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ వేసిన అనుబంధ పిటిషన్‌ను తోసిపుచ్చింది. అంతకుమించి.. దేవాదాయ శాఖ కమిషనర్ అర్జున్‌రావు, కళాశాల విద్య ప్రత్యేక కమిషనర్ ఎంఎం నాయక్, కళాశాల విద్య రాజమహేంద్రవరం ఆర్జేడీ డేవిడ్ కుమార్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.
Also Read: జగన్ ‘ఏకగ్రీవ’ నిర్ణయం : మంత్రులకు టార్గెట్
దీనిపై స్పందించిన ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుతో విజ్ఞాపన చేశారు. మధ్యాహ్నం విచారణకు హాజరవుతారని ఎన్‌బీడబ్ల్యూ వెనక్కి తీసుకోవాలని కోరారు. దీంతో హైకోర్టు విచారణను కొద్దిసేపు వాయిదా వేసింది. మధ్యాహ్నం విచారణకు అర్జున్‌రావు, ఎంఎం నాయక్, కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కాలేజీ రాజమహేంద్రవరం కరస్పాండెంట్ రామ్మోహనరావు హాజరై వివరణ ఇచ్చారు. దీంతో వారిపై ఎన్‌బీడబ్ల్యూ ఉత్తర్వులను కోర్టు వెనక్కి తీసుకుంది. కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆర్జేడీ డేవిడ్ కుమార్‌పై నాన్‌బెయలబుల్ వారంట్‌ను జారీ చేసింది. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాలని రాజమహేంద్రవరం టౌన్ ఎస్పీని ఆదేశించింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
మూడేళ్లుగా కోర్టు ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదో ప్రతివాదులందరూ వివరణ ఇస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేస్తూ ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఆదేశాలిచ్చారు. కనీస టైం స్కేల్ అమలు చేయాలని కోర్టు ఆదేశించినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఎస్‌కేఆర్ కాలేజీ అటెండర్ ఆర్‌వీ పాపారావు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు. దీనిపై బుధవారం హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాన్ని విత్‌డ్రా చేసుకోవాలంటూ కాలేజీ కరస్పాండెంట్ రామ్మోహనరావు ఒత్తిడి తెస్తున్నారని పాపారావు జడ్జి ముందు చెప్పుకొచ్చారు. దీంతో జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన తప్పును సరిదిద్దుకోకుండా.. ధిక్కరణ వ్యాజ్యాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేస్తారా అని నిలదీశారు.