Somu Veeraju vs YCP: ప్రస్తుత కాలంలో ఎవరు ఎక్కువ అప్పులు చేస్తే అంత విలువ అన్నట్టుగా పరిస్థితులు మారాయి. చాలా మంది రాజకీయ పెద్దలు బ్యాంకులకు వేల కోట్లు అప్పులు చేసి ఎగనామం పెట్టేస్తున్నారు. కరోనా కల్లోలంతో ప్రభుత్వాలు ఆర్బీఐ, ఇతర రుణ సంస్థల నుంచి భారీగా అప్పులు తీసుకుంటున్నాయి. అసలే అప్పుల్లో ఉన్న ఏపీని నడిపించడానికి వైసీపీ ప్రభుత్వం మరింత అప్పులు చేసింది. జీతాలు, పెన్షన్లకు ప్రతీ నెల ఇవ్వడానికి ఆపసోపాలు పడుతూ అప్పులు ఇంకా చేస్తూనే ఉంది. అయితే సంక్షేమం, అభివృద్ధి విషయంలో మాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రజలకు పంచడంలో వెనకడుగు వేయడం లేదు.
అయితే తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాజేసిన మాటల మంటలు వైసీపీని షేక్ చేశాయి. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శల వాడిని సోము పెంచేశారు. వైసీపీ అప్పులను లెక్కా పత్రాలతో సహా వివరించి షాక్ ఇచ్చారు. వైసీపీ అప్పులు తీర్చేందుకు మద్యం రేట్లు భారీగా పెంచేసిందని.. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను రూ.50కే ఇస్తామని ప్రకటించి సంచలనం సృష్టించారు. అంతేకాదు.. వైసీపీ చేసిన అప్పులు, వడ్డీల లెక్క చెప్పి అధికార పార్టీని ఉక్కిరి బిక్కిరి చేశారు.
ఏపీ ప్రభుత్వం ఇప్పటిదాకా 6 లక్షల కోట్లు అప్పు చేసిందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. దానిపై వడ్డీ 7శాతం అంటే ఏడాదికి 42000 కోట్లు కట్టాలని.. నెలకు రూ.3500 కోట్లు అని.. రోజుకి 116 కోట్లు అవుతుందని వీర్రాజు లెక్కలు చెప్పారు. ప్రతి వ్యక్తిపైన రోజుకు రూ.23, నెలకు 690, ఏడాదికి రూ.8280 రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుందని.. ఇంట్లో నలుగురు ఉంటే ఏకంగా 33120 రూపాయల వడ్డీ కట్టాలంటూ వీర్రాజు లెక్కలతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేశారు. ఈ అప్పులు వడ్డీని అంతా మద్యం ధరలపై వేసి ప్రజలనుంచి పిండుకుంటోందని వీర్రాజు సంచలన ఆరోపణలు చేశారు.
మేమే దేశంలో అప్పులు చేశామా? కేంద్రంలోని బీజేపీ చేయలేదా? అంటూ వైసీపీ నేతలు, మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. కేంద్రం కూడా ఇప్పటికీ అప్పులు చేస్తూనే ఉందని మంత్రి పేర్ని నాని లెక్కలు తీశారు. కరోనా కారణంగా ఏపీ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతిందని..దానిని గాడిలో పెట్టేందుకు అప్పులు చేసినా.. ఎక్కడా ప్రజా సంక్షేమ పథకాలు నిలిచి పోకుండా ప్రజలు ఏ విషయంలోనూ ఇబ్బందులు ఎదుర్కోకుండా జగన్ వ్యవహరిస్తున్నారని .. ఏపీ ప్రభుత్వం మాత్రమే అప్పులు చేస్తున్నట్టుగా బీజేపీ నేతలు విమర్శలు చేయడం సరికాదంటూ మంత్రి చెప్పుకొచ్చారు.
Also Read: ఎమ్మెల్యే రోజాకు కాలం కలిసిరావడం లేదా?
ఏపీ ప్రభుత్వం జీఎస్డీపీలో కేవలం 4 శాతంలోపే అప్పు చేసిందని.. కానీ కేంద్రప్రభుత్వం 21శాతం వరకూ అప్పు చేసిందని.. విదేశీ రుణం కూడా తీసుకుందని మంత్రి పేర్ని నాని లెక్కలతో కొట్టారు. ఏపీ ప్రభుత్వం తీర్చే అప్పు మాత్రమే చేసిందని.. కానీ కేంద్రంలోని బీజేపీ మాత్రం తీర్చలేనంత అప్పు చేసిందని ఎద్దేవా చేశారు. ఇక ఏపీలోని బీజేపీ ఎంపీలైన సుజనా చౌదరి, సీఎం రమేశ్ లీజుల వ్యవహారంపై మంత్రి పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సోము వీర్రాజు సైతం గట్టిగానే బదులిచ్చారు.
ఇప్పటికే ఒకవైపు జనసేన, మరోవైపు టీడీపీ వైసీపీని టార్గెట్ చేసుకుంటూ తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ తమ గురించి చర్చ జరిగేలా చూసుకుంటూ తమ పార్టీ గ్రాఫ్ పెంచుకునే విధంగా వ్యవహరించాయి. ఇప్పుడు అంతకుమించి బీజేపీ కూడా లైన్లోకి వచ్చింది. వరుసగా ఏపీ ప్రభుత్వంను టార్గెట్ చేసుకొని ప్రజల్లో బీజేపీకి ఆదరణ పెరిగేలా చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. దీనిలో భాగంగానే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.