
Vijayasai Reddy : వారిద్దరు తిట్ల పురాణం మొదలు పెడితే.. ఆ తిట్లను రాతల్లో రాయలేం. మాటల్లో చెప్పలేం. వారి పరస్పర దూషణలు అలా ఉంటాయి. వీరలెవెల్లో తిట్టుకునే వారిద్దరిలో అనూహ్య మార్పు వచ్చింది. ఒకరినొకరు తిట్టుకోవడం మాని.. పొగడ్తల వర్షం కురిపించుకుంటున్నారు. ఇదంతా చూసిన జనం మార్పు మంచికేనా ? అన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారెవరు ? వారిలో ఎలాంటి మార్పు వచ్చిందో చూద్దాం.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ట్వీట్ల పురాణం తెలియని వారుండరు. ఇద్దరూ ఒకే పార్టీ ఎంపీలే. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది అనేలా వీరిద్దరి మధ్య వైరం పెరిగింది. ట్విట్టర్లో, మీడియాలో వీర లెవల్లో బూతులు తిట్టుకున్నారు. రాయలేనంత పచ్చిగా, మాట్లాడుకోలేనంత అసభ్యంగా దూషణల పర్వం కొనసాగించారు. కానీ ఇటీవల విజయసాయిరెడ్డిలో అనూహ్య మార్పు వచ్చింది. అప్పటి వరకు చంద్రబాబు, లోకేష్ ను దూషించిన విజయసాయిరెడ్డి.. ఒక్కసారిగా స్వరం మార్చారు. లోకేష్ బర్త్ డే కు శుభాకాంక్షలు తెలిపారు. మంచి ఆరోగ్యం ఉండాలి, మంచి స్థాయికి ఎదగాలని ఆశించారు. విజయసాయి వ్యాఖ్యలతో పొలిటికల్ జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇంత మార్పు దేనికీ అంటూ ఆశ్చర్యపోయారు.
లోకేష్ కు విషెస్ తో మొదలుపెట్టిన విజయసాయిరెడ్డి.. క్రమంగా మార్పు చెందారు. తారకరత్న అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరితే బెంగళూరు వెళ్లి పరామర్శించారు. అంతటితో ఆగకుండా నందమూరి బాలకృష్ణ పై పొగడ్తలు కురిపించారు. తారకరత్న విజయసాయిరెడ్డికి అల్లుడి వరుస అవుతాడు. ఈ నేపథ్యంలో తారకరత్న ఆరోగ్యాన్ని బాలకృష్ణ దగ్గరుండి చూసుకున్నారని బాలయ్య పై సాయిరెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆస్పత్రిలో 23 రోజుల పాటు చికిత్స పొందుతూ తారకరత్న మరణించారు. తారకరత్నకు విజయసాయిరెడ్డి నివాళి అర్పించారు. అదే సమయంలో చంద్రబాబు కూడా తారకరత్నకు నివాళి అర్పించడానికి వచ్చారు. అక్కడ చంద్రబాబు, విజయసాయిరెడ్డి పరస్పరం అభివాదం చేసుకున్నారు. పక్క పక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. ఈ సీన్ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ ఆసక్తి రేకెత్తించిందని చెప్పొచ్చు.
చంద్రబాబు పట్ల విజయసాయిరెడ్డి వ్యవహరించిన తీరును ఎంపీ రఘురామకృష్ణరాజు అభినందించారు. ఒక నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవాన్ని విజయసాయిరెడ్డి ఇచ్చారంటూ మెచ్చుకున్నారు. ఇన్నాళ్లు విజయసాయిరెడ్డి ట్విట్టర్ అకౌంట్ ఎవరో హ్యాండిల్ చేసి ఉంటారని, ఆ తర్వాత విజయసాయిరెడ్డి ట్వీట్లలో మార్పు వచ్చిందని రఘురామ అన్నారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి మధ్య జరిగిన సంభాషణను రాజకీయం కోణంలో చూడొద్దని రఘురామ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు రఘురామ వ్యాఖ్యలు పొలిటికల్ గా హాట్ టాపిక్ అయ్యాయి. వైసీపీలో విజయసాయిరెడ్డి ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో టీడీపీ నేతల పట్ల విజయసాయి రెడ్డి వైఖరి కూడా మారుతోంది. ఒకానొక దశలో తానూ, చంద్రబాబు ఇద్దరూ బంధువులమని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తాజాగా చంద్రబాబుతో స్నేహపూర్వకంగా సంభాషించడం విజయసాయిరెడ్డిలో మార్పును స్పష్టం చూపిస్తోంది. అయితే ఈ మార్పు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచిచూడాలి.