Minister Dharmana Prasada Rao: సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు సొంత పార్టీ శ్రేణులనే ఆశ్చర్యపరుస్తున్నారు. నాయకత్వాన్ని ఇరుకునపరిచేలా మాట్లాడుతున్నారు. ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. గత నాలుగున్నర ఏళ్లుగా వైసీపీ క్యాడర్ చితికిపోయిందని ఒకసారి వ్యాఖ్యానించారు. విశాఖ రాజధానికి మద్దతు తెలపరెందుకని ప్రజలపై రుసురుసులాడారు. మరోసారి జగన్ సర్కార్ పై వ్యతిరేకత నిజమేనని చెప్పుకొచ్చారు. తాజాగా అందరూ నాయకులు జైలుకెళ్లి వచ్చేవారేనంటూ వ్యాఖ్యానించి దుమారం రేపారు.
ధర్మాన ప్రసాదరావు పొడిపొడిగా మాట్లాడతారు. చాలా రకాలుగా విశ్లేషించి వ్యాఖ్యానిస్తారు. కానీ ఇటీవల మాత్రం ఇష్టారాజ్యంగా మాట్లాడి.. వైసీపీ శ్రేణులను సైతం బోర్ కొట్టిస్తున్నారు. అందుకే ఆ మధ్యన ఆయన సొంత నియోజకవర్గమైన శ్రీకాకుళంలో సభలు, సమావేశాలు పెడితే ప్రజలు ముఖం చాటేశారు. మహిళలు బహిరంగ సభల నుంచి మధ్యలోనే పరారయ్యారు. వారిని నియంత్రించేందుకు నిర్వాహకులు గేట్లకు తాళాలు వేయాల్సి వచ్చింది. విశాఖ రాజధాని కి మద్దతుగా ఆయన ప్రజలతో జేజేలు చెప్పించుకోవాలని భావించారు. వారి నుంచి స్పందన లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు.
సంక్షేమ పథకాలు అందించే క్రమంలో.. ఓ లబ్ధిదారురాలకు ఏ పార్టీకి ఓటు వేస్తావమ్మా అని మంత్రి ధర్మాన ప్రశ్నించారు. ఆమె నుంచి సానుకూలమైన మాట వస్తుందని ఆశించారు. కానీ ఆమె చటుక్కున సైకిల్ అని చెప్పడంతో చిన్నబోయారు. దశాబ్దాలుగా సైకిల్ కి ఓటు వేయడం ద్వారా ఆ గుర్తు అలవాటు పడిపోయిందని చెప్పుకొచ్చారు. మంత్రిగా ఉన్నా.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలను కూడా ఒప్పించి, నప్పించలేని స్థితిలో ప్రసాదరావు ఉన్నారు.
తాజాగా సీఎం జగన్ సైతం జైలుకు వెళ్లి వచ్చారని గుర్తుచేస్తూ ధర్మాన వ్యాఖ్యానించారు. దేశంలో లాలు ప్రసాద్ యాదవ్, జయలలిత, కరుణానిధి లాంటి నాయకులు జైలుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. అంతెందుకు ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ సైతం జైలుకు వెళ్లలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ విషయంలో ఏపీ సర్కార్ తప్పులేదని చెప్పేందుకు ఈ ఉదాహరణలన్నీ చెప్పుకొచ్చారు. దీనిపై వైసీపీ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఓ సీనియర్ మంత్రిగా ఉంటూ ధర్మాన ఇలా చేస్తున్నారేంటి అని ప్రశ్నిస్తున్నారు. మాట్లాడి పార్టీని ఇరుకున పెడుతున్నారని.. మాట్లాడకుండా ఉండడమే మంచిదని సలహా ఇస్తున్నారు.