APSRTC: ఏపీఎస్ ఆర్టీసీకి ఏమైంది? ఇప్పడు అంతటా ఇదే హాట్ టాపిక్. దేశంలోనే అతిపెద్ద రవాణా సంస్థ ఏపీఎస్ ఆర్టీసీ. రాష్ట్ర విభజన తరువాత ఏపీఎస్ ఆర్టీసీ, టీఎస్ ఆర్టీసీ వేరుపడ్డాయి. ఏపీలో జగన్ సర్కారును ఏపీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ ను ప్రభుత్వంలో విలీనం చేసింది. దీంతో ఆర్టీసీ స్వరూపమే మారిపోతుందని అంతా భావించారు. కానీ బస్సుల నిర్వహణ నుంచి ఉద్యోగుల సమస్యల వరకూ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. బస్సులు ఎప్పుడు వస్తాయో.. ఎప్పుడు రావో తెలియని పరిస్థితి. కాలం చెల్లినవి కావడంతో ఎక్కడ మొరాయిస్తాయో తెలియవు. సకాలంలో గమ్యస్థానాలకు చేర్చడం కూడా ప్రశ్నార్థకమే. అంతలా అపవాదు ఉంది ఏపీఎస్ఆర్టీసీపై. దానిని నిజం చేసేలా ఇటీవల వరుస ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా కృష్టా జిల్లా గుడివాడలో 60 మంది ప్రయాణికులతో వెళుతున్న బస్సులో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. క్షణాల్లో బస్సు కాలిపోయింది. ప్రాణాలతో బయటపడేందుకు జనాలు కిటికీలు, డోర్ల నుంచి బయటకు గెంతేశారు.

శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి గుడివాడకు పల్లె వెలుగు బస్సు 60 మంది ప్రయాణికులతో బయలుదేరింది. సరిగ్గా బస్సు పెద్దపారుపూడి మండలం వెంట్రప్రగడ వచ్చేసరికి ఇంజన్ నుంచి పొగలు వచ్చాయి. కొద్దిసేపటికే మంటలు ఎగసిపడ్డాయి. వివిధ పనులమీద వెళుతున్న ప్రయాణికులు, విద్యార్థులు బ్యాగులు, లగేజీని విడిచిపెట్టి మరీ పరుగులు తీశారు. ప్రాణభయంతో బస్సు నుంచి బయటకు గెంతేసిన వారూ ఉన్నారు. అయితే ఎవరికి ఎటువంటి గాయాలు తగలకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. అయితే విద్యార్థుల పుస్తకాలు, ప్రయాణికుల బ్యాగులు కాలిపోయాయి. నగదు సైతం కాలిపోయిందని బాధితులు చెబుతున్నారు. ఈ హఠాత్ పరిణామంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. రోడ్డు గోతులమయంగా మారడంతో కుదుపులకు షార్ట్ సర్క్యూట్ అయ్యిందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
కొద్దిరోజుల కిందట తూర్పుగోదావరి జిల్లాలో ఇటువంటి ఘటనే జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు వెనుక చక్రాలు ఊడిపోయాయి. భారీగా శబ్ధం రావడంతో బస్సును డ్రైవరు నిలిపివేశాడు. హైవేపై ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో ముందూ వెనుక వాహనాలేవీ రాలేదు. లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉండేది. అంతకు రెండు రోజుల ముందే విశాఖ నుంచి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వెళుతున్న ఎక్స్ ప్రెస్ సర్వీసులో ఏకంగా ప్రయాణికులంతా గొడుగులు వేసుకున్నారు. వర్షాలకు కేబిన్ పైకప్పునకు రంధ్రాలు ఉండడంతో వర్షపు నీరు ధారగా బస్సులో పడింది.

దీంతో ప్రయాణికులు తమ వెంట తెచ్చుకున్న గొడుగులు వేసుకోవాల్సి వచ్చింది. ప్రయాణికులు ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఏపీఎస్ ఆర్టీసీ తీరుపై నెటిజెన్లు తెగ కామెంట్స్ పెట్టారు. వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్టీసీలోకొత్త బస్సులుకొనుగోలు చేసిన దాఖలాలు లేవు. సాధారణంగా ఆర్టీసీలో కొత్త బస్సులను ఎక్స్ ప్రెస్ ల కింద సుదూర సర్వీసుల కోసం వినియోగిస్తారు. 5 లక్షల కిలోమీటర్లు తిరిగిన తరువాత కంప్లీట్ సర్వీసింగ్ చేయాలి. కానీ డిపో గ్యారేజీలో విడిపరికరాలు లేవు. వాటిని అమర్చాలంటే నిపుణులైన మెకానిక్ లు లేరు. దీంతో పైపైన మెరుగులు దిద్ది రోడ్లపై విడిచిపెడుతున్నారు. బస్సులు కనీస మరమ్మతులకు నోచుకోవడం లేదు. అటు 13 లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను కాలం చెల్లినవిగా పరిగణిస్తారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 30 నుంచి 40 శాతం వరకూ బస్సులు అవే కోవలోకి వస్తాయి. అటు ఆర్టీసీలో కొత్త నియామకాలు కూడా మందగించాయి. ఒక్కో బస్సుకు డ్రైవర్, కండక్టర్, మెకానిక్ లను కలుపుకొని ఐదుగురు వరకూ ఉండాలి. కానీ ఆ శాతాన్ని తీసుకుంటే ఒక్కరు మాత్రమే ఉన్నారు.