https://oktelugu.com/

ACB Raids: కేసీఆర్ ధరణి కాసులు కురిపిస్తుంటే.. రెవెన్యూ అధికారులు ఇలానే సంపాదిస్తారు!

కెసిఆర్ చెబుతున్నట్టు రెవెన్యూ వ్యవస్థలో ఇంకా అవినీతి పూర్తిగా ప్రక్షాళన కాలేదు. ఇవాల్టికి చెయ్యి తడిపితేనే పని జరుగుతున్నది. భూములకు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్లు అడ్డగోలుగా జరిగిపోతున్నాయి.

Written By:
  • Rocky
  • , Updated On : September 30, 2023 / 07:22 PM IST

    ACB Raids

    Follow us on

    ACB Raids: “నల్గొండ జిల్లా మర్రిగూడ తహసిల్దార్ మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇంట్లో శనివారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు దాడులు ప్రారంభించారు.. ట్రంకు పెట్టెల్లో దాచిన నగదును బయటికి తీశారు. బీరువాల్లో దాచిన కిలోల కొద్దీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒక్క ట్రంక్ పెట్టెలో ఏకంగా రెండు కోట్లకు పైగా నగదు లభ్యమైంది.” ఒక్క టీ న్యూస్ తప్ప మిగతా మీడియాల్లో బాగా ప్రసారం అవుతున్న వార్త ఇది. వాస్తవానికి ఒక మండల రెవెన్యూ అధికారి ఈ స్థాయిలో సంపాదించాడు అంటే మాటలు కావు. రెవెన్యూ వ్యవస్థలో అవినీతిని పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ధరణి అనే పథకాన్ని తెచ్చాను అంటాడు కెసిఆర్. తాను పాల్గొనే ప్రతి బహిరంగ సభలోనూ ధరణి ఉండాలా? తీసేయాలా? అని అక్కడికి వచ్చిన ప్రజలను అడుగుతుంటాడు. కానీ ఇవాల్టికి ఆ ధరణి అనేది ఒక లోపాల పుట్ట. రెవెన్యూ అధికారులకు కాసులు కురిపించే ఒక కామధేనువు. భూములకు సంబంధించి ఎటువంటి వివాదాలున్నా రెవెన్యూ అధికారులు పంట పండించుకుంటున్నారు. ఎలాగూ స్థానిక ఎమ్మెల్యేలకు కప్పం కట్టి పోస్టులు దక్కించుకుంటున్నారు కాబట్టి అసలు అడిగేవాడే లేడు. మంచి రెడ్డి మహేందర్ రెడ్డి పేరుకే గాని ఇతడి వెనుక ఎంతో మంది ఉన్నారు. అంతమంది ప్రత్యక్ష సహకారం లేకుండా మహేందర్ రెడ్డి అనేవాడు ఈ స్థాయిలో సంపాదించడం దాదాపు అసాధ్యం.

    కెసిఆర్ చెబుతున్నట్టు రెవెన్యూ వ్యవస్థలో ఇంకా అవినీతి పూర్తిగా ప్రక్షాళన కాలేదు. ఇవాల్టికి చెయ్యి తడిపితేనే పని జరుగుతున్నది. భూములకు సంబంధించి డబుల్ రిజిస్ట్రేషన్లు అడ్డగోలుగా జరిగిపోతున్నాయి. అడిగేవాడు లేకపోవడంతో రెవెన్యూ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి ప్రజా ప్రతినిధుల సహకారం ఉండడంతో ప్రజలను వారు పీల్చి పిప్పి చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉండే విఆర్వో వ్యవస్థను, వీఆర్ఏ వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత గిర్దవార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, తహసీల్దార్లు పంట పండించుకుంటున్నారు. ప్రభుత్వం కూడా రిజిస్ట్రేషన్ అధికారం వీరికే కట్టబెట్టడంతో అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఆ మధ్య లంచం తీసుకుంటున్నారని అబ్దుల్లాపూర్మెట్ మండల రెవెన్యూ అధికారి పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. అప్పట్లో ఆ సంఘటన రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఆ సంఘటన అమానవీయం అయినప్పటికీ.. దాని వెనుక ఉన్న బాధితులు రెవెన్యూ అధికారుల తీరు వల్ల ఏళ్లకు ఏళ్ళు ఇబ్బంది పడ్డారు. లంచాలు ఇచ్చినా పనిచేయకపోవడంతో ఆ ఘాతుకానికి పాల్పడ్డారు. మరోవైపు హైదరాబాద్ నగర శివారులో పనిచేసే మండల రెవెన్యూ అధికారి ఏ సి బి కేసులో దొరికిపోవడంతో ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఆమె కూడా తీవ్ర అనారోగ్యానికి గురయింది. ఆస్పత్రిలో చేర్పిస్తే కోలుకుంది. కానీ తన వల్ల కుటుంబం చిన్నా భిన్నం కావడంతో ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి సంఘటనలు రెవెన్యూ అధికారులకు కనువిప్పు కలిగించడం లేదు. పైగా వేధించడం, కార్యాలయాలకు వచ్చేవారి నుంచి వసూళ్లు చేయడం అలవాటుగా మార్చుకున్నారు.

    హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాలో రెవెన్యూ పోస్టుల కోసం లక్షల్లో బేరసారాలు నడుస్తున్నాయి. ఈ ప్రాంతంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతూ ఉండడమే ఇందుకు కారణం. పైగా ఇక్కడ వివాదాస్పద భూములు భారీగా ఉండడంతో రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులకు ఎదురు లంచాలు ఇచ్చి మరీ పోస్టింగులు తెచ్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాజకీయ అండదండలు ఉండడంతో అడ్డు అదుపు లేకుండా వీరు తమ దందా కొనసాగిస్తున్నారు. అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను బినామీల పేరున రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. తాజాగా మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఉదంతం కేవలం శాంపిల్ మాత్రమే. ఏసీబీ అధికారులు ఇలాగే దాడులు చేస్తూ ఉంటే ఎంతమంది రెవెన్యూ అధికారుల భాగోతాలు బయటికి వస్తాయి. ఇదే సమయంలో ధరణి అనే పథకాన్ని అడ్డుపెట్టుకొని వారు సంపాదిస్తున్న తీరు కూడా బయటికి వస్తుంది. ఇలాంటివి బయటపడినప్పుడు కెసిఆర్ నోరు మెదపడు. కెసిఆర్ భజన పత్రిక మౌనాన్ని ఆశ్రయిస్తుంది.