Chandrababu- Kasani Gnaneshwar: తెలంగాణలో టీడీపీ కాడి ఎత్తేసిన ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన ప్రియ శిష్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కోసం మరొకరిని బలి చేశారు. టీఆర్‌ఎస్(ప్రస్తుతం బీఆర్‌ఎస్)ను దెబ్బ తీసేందుకు 2018లో కాంగ్రెస్‌తో చేతులు కలిపిన బాబు.. మహాకూటమి ద్వారా ఎన్నికల బరిలో నిలిచారు. కానీ బీఆర్‌ఎస్ దూకుడు, కేసీఆర్ వ్యూహం ముందు బాబు పప్పులు, ఎత్తులు ఉడకలేదు. ఎన్నికల్లో టీడీపీ నుంచి ముగ్గురు ఎమ్మెల్యేలు గెలవగా తర్వాత వారు కూడా బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇక కాంగ్రెస్ నుంచి 12 మంది బీఆర్‌ఎస్ గూటికి చేరారు.
2023 ఎన్నికలపై దృష్టి..
తాజాగా కేసీఆర్‌ను మరోమారు దెబ్బకొట్టేందుకు, ఏపీలో బీజేపీని ప్రసన్నం చేసుకునేందుకు నారా చంద్రబాబు నాయకుడు కొత్త ఎత్తుగడ వేశారు. 2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ప్లాన్ వేశారు. ప్రస్తుతం టీడీపీలో బలమైన లీడర్ లేకపోయినా బలమైన క్యాడర్ ఉందని నిరూపించేందుకు తెలంగాణలోనే పెద్ద సామాజికవర్గానికి చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ముదిరాజ్‌ను పార్టీలోకి పిలిచి మరీ పగ్గాలు అప్పగించారు. తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించారు. ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు.
బాబు జైలుకు వెళ్లడంతో..
అనూహ్యంగా స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లడంతో పరిణామాలు వేగంగా మారిపోయాయి. ఎన్నికల బరిలో నిలిచేందుకు సమయాత్తమైన టీడీపీ ఆశలు సన్నగిల్లాయి. అయినా టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని, 89 స్థానాల్లో అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. రాజమండ్రి జైల్లో ములాఖత్ తర్వాత అభ్యర్థులను ప్రకటిస్తామని వెల్లడించారు. చంద్రబాబు జైల్లో ఉన్నా తెలంగాణ ఎన్నికల ప్రచార బాధ్యతలను బాలకృష్ణ చూసుకుంటారని కూడా తెలిపారు.
ములాఖత్ తర్వాత హ్యాండిచ్చిన బాబు..
తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్‌కు సమయం దగ్గర పడడంతో టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయకుడును ములాఖత్ ద్వారా రాజమండ్రి సెంట్రల్ జైల్లో కలిశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై చర్చించారు. 89 మందితో జాబితా రెడీ చేసినట్లు తెలిపారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయవద్దని సూచించారు. ప్రస్తుత పరిస్థితిలో పార్టీ తరఫున ప్రచారానికి ఎవరూ వచ్చే పరిస్థితి లేదని, ఈ సమయంలో పోటీ చేయడం సరికాదని తెలిపారు.
టీడీపీకి కాసాని రాజీనామా..
బాబు నిర్ణయంతో మనస్తాపం చెందిన టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తన పదవికి, పార్టీకి సోమవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా పలు అంశాలు వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని చంద్రబాబు సూచించారని తెలిపారు. ఏపీలో బీజేపీతో కలిసి పనిచేసేందుకు యత్నిస్తున్న సమయంలో తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వమనడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల్లో పోటీ చేయనప్పుడు ఎందుకు పిలిచారని, ఎందుకు సభ పెట్టించాలని అడిగారు. అభ్యర్థులంతా సొంత డబ్బులో పోటీకి సిద్ధమయ్యారని, ఈ క్రమంలో అసలు పోటీనే చేయవద్దనడాన్ని తప్పు పట్టారు. ఈ పరిణామాలతోనే పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు.
రేవంత్ కోసం కాసాని బలి..
టీపీసీసీ చీఫ్, చంద్రబాబు నాయకుడు ప్రియ శిష్యుడు అయిన రేవంత్ రెడ్డి కోసమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి టీటీడీపీ తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా చంద్రబాబు ఎత్తుగడలో భాగమే అంటున్నారు. టీడీపీ క్యాడర్ అంతా కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని కాసాని జ్ఞానేశ్వర్‌కు సూచించడం ఇందులో భాగమే అంటున్నారు విశ్లేషకులు. తెలంగాణలో పార్టీ కనుమరుగవుతున్న వేళ రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి పంపింది బాబే అన్న ఆరోపణలు అప్పట్లో వచ్చాయి. తర్వాత ఏడాది క్రితం టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా బాబు చలవతోనే వచ్చిందని పలువురు ఆరోపించారు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి టీడీపీ తప్పుకోవడం కూడా రేవంత్ కోసమే అని పలువురు భావిస్తున్నారు. తన శిష్యుడిని సీఎం చేయడానికి టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను బలి చేశాడని విశ్లేషకులు పేర్కొంటున్నారు.