
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా రాజకీయాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నిక నుంచి ఈ రెండు పార్టీ మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అయితే ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించేశారు. కేసీఆర్ ఫ్యామిలీకి జైలు కూడు తప్పదన్నట్లుగా వ్యాఖ్యలు చేశారు. సమయం దొరికినప్పుడల్లా టీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు సంజయ్.
Also Read: కేసీఆర్.. పీఆర్సీ.. ఓ 60వేల కోట్ల మిగులు కథ!
తాజాగా.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ముఖ్యంగా బీజేపీ నేతలు ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడడంతో ఈ వివాదానికి దారితీసినట్లయింది. ఒకవిధంగా హరీష్, సంజయ్‌ల మధ్య మాటల తూటాలే పేలుతున్నాయి. ఈ ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు.
గతంలో దుబ్బాకలో ఓటమి.. జీహెచ్‌ఎంసీలో సానుకూల ఫలితాలు రాకపోవడంతో ఒకింత టీఆర్‌ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు సైలెంట్ అయిపోయారు. కానీ.. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో ఒక్కసారిగా రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా మంత్రి హరీష్ మాత్రం దూకుడు మరింత పెంచారు. దేశభక్తి సరే.. స్వరాష్ట్రంపై మీ భక్తి ఏదీ? అంటూ బండి సంజయ్‌ని ప్రశ్నించారు. అయితే.. ఆ వెంటనే హరీష్ వ్యాఖ్యలకు సంజయ్ కౌంటర్ ఇచ్చేశారు.
ఉద్యమ సమయంలో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న హరీష్ రావుకు అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదంటూ సంజయ్ ఎద్దేవా చేశారు. అగ్గిపెట్టె ఎందుకు దొరకలేదనే దానిపై సీబీఐ విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. శ్రీకాంతాచారికి దొరికిన అగ్గిపెట్టె.. హరీష్ రావుకు దొరకదా..? అని ప్రశ్నించారు. హరీష్ అంటేనే అబద్ధాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారని అభివర్ణించారు. దుబ్బాకలో అబద్ధాలు మాట్లాడినందుకే హరీష్ వీపు సాఫ్ అయిందని ఎద్దేవా చేశారు. శాసనసభలో లేని వ్యక్తి గురించి విమర్శలు చేయకూడదని సీనియర్‌గా చెప్పుకున్న హరీష్ రావుకు తెలియదా? అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టుల పేరుతో తెలంగాణ ప్రభుత్వం భారీగా అవినీతికి పాల్పడిందని, ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలని మాత్రమే లేఖ రాశానని సంజయ్ తెలిపారు.
Also Read: పవన్ మద్దతు కోసం కదిలివచ్చిన రత్నప్రభ, బీజేపీ పెద్దలు
‘అన్ని అనుమతులు వచ్చేవరకూ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వొద్దని, ఇందుకోసం తెలంగాణకు మాత్రమే వర్తించేలా ప్రత్యేక చట్టం తేవాలని కేంద్ర మంత్రులు జావదేకర్, షెకావత్‌లకు లేఖలు రాస్తారా? రాజకీయ ప్రయోజనాల కోసం, స్వార్థ రాజకీయాల కోసం, పదవుల కోసం రాష్ట్ర ప్రజా ప్రయోజనాలను పణంగా పెడతారా?’ అంటూ బండిపై హరీశ్ మండిపడ్డారు. సంజయ్ రాసిన లేఖల సారాంశాన్ని చదివి వినిపించారు. బడ్జెట్ పద్దులపై చర్చలో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వారికి ఉన్న దేశభక్తి సరే.. స్వరాష్ట్రంపై భక్తి ఎక్కడకు పోయింది? ఎన్నుకున్న రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు పట్టవా? రాజకీయ ప్రయోజనాలపైనే వారి ధ్యాస ఉంటుందా? రైతుల నోట్లో మట్టి కొట్టడానికి రాజకీయం చేస్తారా?’ హరీష్ అని విమర్శించారు.
సంజయ్–-హరీష్ మాటల యుద్ధం తారాస్థాయికి చేరడంతో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. సాగర్ ఉపఎన్నిక వేళ వీరి మాటల తూటాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నాయి. మున్ముందు ఇంకెలాంటి కౌంటర్లు ఎదురవుతాయోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తు్న్నారు. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయినా నేతల మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్