
ప్రపంచంలోని పెద్ద నదీ ఒప్పందాల్లో సింధు నదీ ఒప్పందం ఒకటి. ఈ నది పరివాహక ప్రాంతం దాదాపు 11.2 లక్షల కిలోమీటర్లు. ఈ నది పాకిస్థాన్ లో 47 శాతం ప్రవహిస్తుండగా.. భారత్ లో 39 శాతం, చైనలో 8 శాతం, అఫ్గానిస్తాన్ లో 6 శాతం పారుతోంది. ఈ నదీ పరివాక ప్రాంతంలో దాదాపు 30 కోట్ల మంది నివసిస్తున్నారని అంచనా. ఈ నదీ జలాలను ఎవరెవరు ఎలా ఉపయోగించాలనే విషయమై, 60 సంవత్సరాల క్రితం ఒప్పందాలు జరిగాయి. ఈ నెల 23. 24 తేదీల్లో సింధు నది శాశ్వత కమిషన్ 116వ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మరోసారి జల వివాదం చర్చల్లోకి వచ్చింది.
Also Read: పవన్ మద్దతు కోసం కదిలివచ్చిన రత్నప్రభ, బీజేపీ పెద్దలు
భారత్-పాక్ మధ్య ఎప్పుడు యుద్ధ వాతావరణం నెలకొన్నా.. ఈ సింధు నది ఒప్పందం రద్దు డిమాండ్ తెరపైకి వస్తూ ఉంటుంది. అయితే.. ఇప్పటి వరకూ ఎన్నిసార్లు యుద్ధాలు వచ్చినా.. ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినా.. ఈ ఒప్పందం మాత్రం చెక్కు చెదరలేదు. కార్గిల్ తో కలిపి మూడుసార్లు భారత్-పాక్ మధ్య యుద్ధం సంభవించింది. ఈ మధ్య ఉరీ, పూల్వామా దాడులు జరిగినప్పుడు కూడా డిమాండ్లు వినిపించినప్పటికీ.. ఆ ఒప్పందం మాత్రం రద్దు కాలేదు. అందుకే.. అంతర్జాతీయ నదీ జలాల పంపకాల్లో ఇది ఒక విజయవంతమైన ఒప్పందంగా ప్రపంచం గుర్తించింది.
ఈ ఒప్పందంలోని నిబంధనల ప్రకారం.. ఏ ఒక్క దేశమో ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం కుదరదు. రెండు దేశాలు కలిసి చర్చించుకున్న తర్వాతే ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే అవకాశం ఉందని పాక్ మాజీ కమిషనర్ జమాత్ అలీ షా చెబుతున్నారు. మరోవైపు అంతర్జాతీయ నదీజల వివాదాలపై పుస్తకం రాసిన బ్రహ్మ చెల్లాని మాత్రం ఇలా రాశారు. ‘‘వియన్నా ఒప్పందం లా ఆఫ్ ట్రీటీస్ సెక్షన్ 62 ప్రకారం.. పాక్ తీవ్రవాద గ్రూపులను తమపై ప్రయోగిస్తోందని చెప్పి ఒప్పందం నుంచి తప్పుకోవచ్చు. మౌళిక పరిస్థితుల్లో తేడాలు ఉంటే.. ఏ ఒప్పందాన్నైనా రద్దు చేసుకోవచ్చని అంతర్జాతీయ న్యాయస్థానమే చెప్పింది’’అని బ్రహ్మచెల్లాని పుస్తకంలో పేర్కొన్నారు.
1947లో దేశ విభజనకు ముందు పంజాబ్, సింధు ప్రాంతాల మధ్య నీటి కేటాయింపుల వివాదం ఉండేది. ఆ తర్వాత దేశవిభజనలో రెండు ప్రాంతాలూ రెండు దేశాలుగా మారిపోవడంతో వివాదం ముదిరింది. దీంతో.. భారత్-పాక్ ఒక ఒప్పందం చేసుకున్నారు. 1948 మార్చి 31 వరకు ఈ ఒప్పందం అమల్లో ఉంది. ఆ తర్వాత మరుసటి రోజు నుంచి ఈ ఒప్పందం రద్దు కావడంతో.. పాకిస్తాన్ కు నీళ్లు వదలడాన్ని భారత్ ఆపేసిందని, దీనివల్ల పాకిస్తాన్ లోని పంజాబ్ లో పంటలు ఎండిఓయాయని జమాత్ షా చెప్పారు.
Also Read: కేసీఆర్.. పీఆర్సీ.. ఓ 60వేల కోట్ల మిగులు కథ!
సింధు ఒప్పందం ప్రకారం.. సింధు, ఉప నధులను రెండు భాగాలు చేశారు. సట్లేజ్, బియాస్, రావి నధులు తూర్పు నదులుగా.. జీలం, చీనాబ్, సింధులను పశ్చిమ నదులుగా గుర్తించారు. ఇందులో భారత్ తూర్పు నదులను, పాక్ పశ్చిమ నదుల నీటిని వాడుకోవచ్చు. పశ్చిమ నదుల్లోని పరిమిత జలాలను భారత్ జలవిద్యుత్, వ్యవసాయం వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు. దీనికోసం ఓ కమిషన్ ఏర్పాటు చేసి, వారు తరచూ సమావేశమై చర్చించి, సమస్యలుంటే పరిష్కరించుకోవాలి. సాధ్యం కాకపోతే తటస్థ నిపుణుల సాయం తీసుకోవాలి. సాధ్యం కాకపోతే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని పరిష్కరించాలనే నిబంధనలు సింధు ఒప్పందంలో ఉన్నాయి.
పాక్ ఆక్రమిత కశ్మీర్ లో డ్యామ్ లు నిర్మిస్తున్నారని, భారత్ చిన్న ప్రాజెక్టులు మొదలు పెట్టినా.. పాక్ అభ్యంతరం చెబుతోందని బ్రహ్మచల్లాని చెబుతున్నారు. ఈ కోణాన్ని చూపుతున్నవారంతా ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని అంటున్నారు. అటు జమాత్ షా మాట్లాడుతూ.. ఈ ఒప్పందం కోసం పాక్ ఎన్నో త్యాగాలు చేసిందని, ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలనే డిమాండ్లను భారత ప్రభుత్వం అంగీకరించదని ఆయన చెబుతున్నారు. మొత్తానికి ఒప్పందంలోని అంశాల ప్రకారం.. ఇప్పటి వరకూ ఏకపక్షంగా నిర్ణయాలైతే జరగలేదు. భవిష్యత్ లో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయన్నది చూడాలి.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్