
నాయకులు ఎంతో మంది ఉంటారు. కానీ ప్రజలు కష్టాలు తెలుసుకొని వేగంగా స్పందించే నేతలు కొందరే ఉంటారు. ఆ కోవకు చెందిన నేతనే మంత్రి హరీష్ రావు. ఎండలతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు మొరపెట్టుకుంటే వెంటనే స్పందించాడు. చుక్క లేని ఆ ప్రాంతానికి కాళేశ్వరం నీటిని తరలించేందుకు ఏకంగా కాలువకు సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి మరీ గండి కొట్టించాడు. ఎండిపోతున్న పంటలకు నీళ్లందించి ఆ రైతుల కన్నీటి కష్టాలు తీర్చాడు. హరీష్ రావు చేసిన పనికి ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.
కూడవెళ్లి పరిసర రైతులు తాజాగా మంత్రి హరీష్ రావును కలిసి పంటలు ఎండిపోతున్నాయని నీరందించాలని వేడుకున్నారు. కెనాల్ నుంచి కూడవెళ్లి వాగులోకి నీటిని వదలాలని రైతులు కోరారు. పంటలు ఎండిపోతున్నాయని.. కాపాడాలంటూ రైతులు హరీష్ రావును వేడుకున్నారు. కాళేశ్వరం నీళ్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే వెంటనే స్పందించిన మంత్రి కోడకండ్ల దగ్గర కెనాల్ ను పరిశీలించారు.
కూడవెళ్లి పరిసర రైతులకు దాదాపు 10వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని హరీష్ రావు పేర్కొన్నారు. వెంటనే ఈ విషయాన్ని కేసీఆర్ కు ఫోన్ లో తెలియజేశారు. సీఎం కేసీఆర్ తో మంత్రి హరీష్ రావు ఫోన్ లో మాట్లాడి సమస్యను వివరించారు. దీంతో తక్షణమే నీటిని వదిలి రైతుల అవసరాలు తీర్చాలని కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
కేసీఆర్ స్పందించి వెంటనే కాలువకు గండి కొట్టించి రైతులకు సాగునీరు అందించడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. హరీష్ చొరవను వేయినోళ్ల పొగిడేశారు.