Harish Rao Siddipet: హరీష్ రావు లేని సిద్దిపేట.. సిద్దిపేట లేని హరీష్ రావును ఊహించుకోవడం కష్టమే. అయితే ఈసారి భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు ఊహించని విధంగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు షాక్ ఇవ్వబోతున్నారు. మూడవసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆలోచనతో ఉన్న ఆయన.. ఈసారి సిద్దిపేటలో కొత్త ముఖానికి టికెట్ ఇవ్వాలని యోచిస్తున్నారు. ఇదే విధానాన్ని రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గాల్లోనూ పాటించాలని ఆయన అనుకుంటున్నారు. హరీష్ రావును మార్చడం ద్వారా ఎన్నికల ముందు పార్టీలో అసమ్మతి లేకుండా చూసుకోవాలని కేసీఆర్ యోచిస్తున్నారు.. విశ్వసనీయవర్గాలు చెప్పిన దాని ప్రకారం.. సిద్దిపేట నుంచి హరీష్ రావును మార్చి ఆయనను హుస్నాబాద్ నియోజకవర్గానికి పంపించాలని కేసీఆర్ అనుకుంటున్నారు. హరీష్ రావు వెళ్లిపోయిన తర్వాత సిద్దిపేట నియోజకవర్గంలో తన అన్న కొడుకు వంశీ ని పోటీ చేయించాలని కెసిఆర్ యోచిస్తున్నారు.
అందుకే పర్యటనలు
గత కొంతకాలంగా సిద్దిపేట కంటే ఎక్కువ హుస్నాబాద్ లోనే హరీష్ రావు పర్యటిస్తున్నారు. ప్రభుత్వపరంగా లబ్ధిదారులకు ఎక్కువ పథకాలు వర్తించేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తున్నారు. అయితే హుస్నాబాద్ తన పూర్వికులదే కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేసినప్పటికీ తాను గెలుస్తానని హరీష్ రావు భావిస్తున్నారు. వాస్తవానికి సిద్దిపేట నుంచి వెళ్లిపోయేందుకు ఇష్టం లేకపోయినప్పటికీ.. పార్టీలో కేసీఆర్ మాట ఫైనల్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన హుస్నాబాద్ వైపు మళ్ళుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వంశీ కూడా ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారని భారత రాష్ట్ర సమితి వర్గాలు చెబుతున్నాయి.
కన్నారావు ఏమన్నారు అంటే
ఇక భారత రాష్ట్ర సమితి అధిపతి కేసీఆర్ కు కన్నారావు అనే వ్యక్తి కుటుంబ సభ్యుడు. కెసిఆర్ కుటుంబానికి సంబంధించిన అంతర్గత వ్యవహారాలలో కన్నారావు కీలక పాత్ర పోషిస్తారు. ప్రగతి భవన్ లో కీలక విషయాలు మొత్తం కన్నారావు కనుసన్నల్లో జరుగుతాయని విశ్వసనీయ వర్గాల భోగట్టా. అలాంటి కన్నారావు ఇటీవల ఒక అంతర్గత సమావేశంలో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని వంశీకి ఇవ్వని పక్షంలో తీవ్ర పరిణామాలు జరుగుతాయని చెప్పినట్టు తెలుస్తోంది.. అయితే ఇదే విషయాన్ని హరీష్ రావు కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా.. ఆయన కూడా దాదాపుగా ఇదే అర్థం వచ్చేలా హరీష్ రావు తో మాట్లాడినట్టు ప్రచారం జరుగుతున్నది. భారత రాష్ట్ర సమితిలో కెసిఆర్ మాట ఫైనల్ కాబట్టి హరీష్ రావు కూడా సైలెంట్ అయిపోయారని ఆయన వర్గీయులు చెబుతున్నారు.
చాలా అభివృద్ధి చేశారు
హైదరాబాద్ మహానగరానికి కూత వేటు దూరంలో ఉన్నప్పటికీ సిద్దిపేట అతంతమాత్రంగానే అభివృద్ధి చెందింది. అయితే భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దండిగా నిధులు రావడంతో తన నియోజకవర్గాన్ని బంగారు తునక లాగా హరీష్ రావు చేసుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. కోమటి చెరువు చుట్టూ ట్యాంక్ బండ్ నిర్మించారు. ములుగులో అటవీశాఖ యూనివర్సిటీని నెలకొల్పారు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇక గత ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించారు. బహుశా ఈ ఘనతను ఇప్పట్లో మరో ఎమ్మెల్యే బ్రేక్ చేయలేకపోవచ్చు. చివరికి అంతటి కేటీఆర్ కూడా హరీష్ రావు ను బీట్ చేయలేకపోవడం విశేషం. సిద్దిపేట అంటే హరీష్ రావు, హరీష్ రావు అంటే సిద్దిపేట గా మారిన నేపథ్యంలో ఇటువంటి సంచలన నిర్ణయం కేసీఆర్ ఎందుకు తీసుకున్నారనేది అంతు పట్టకుండా ఉంది.
దూరం మళ్లీ మొదలైందా
ఇక 2018 ఎన్నికల్లో గెలిచిన తర్వాత హరీష్ రావుకు అంతంత మాత్రమే ప్రాధాన్యం దక్కింది. దుబ్బాకలో ఓటమి అనంతరం హరీష్ రావు ప్రగతి భవన్ వెళ్లడం దాదాపుగా తగ్గించారు. ఇక హుజురాబాద్ ఉప ఎన్నికల్లోనూ భారత రాష్ట్ర సమితి ఓడిపోవడంతో హరీష్ రావును కేసీఆర్ దూరం పెట్టారు. ఒకానొక దశలో హరీష్ రావు బయటకు వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. ఎప్పుడైతే ఈటెల రాజేందర్ అధిష్టానం ఎదుట ధిక్కార స్వరం వినిపించారో అది హరీష్ రావుకు ప్లస్ పాయింట్ అయింది. ఇక హరీష్ రావు కూడా ఇదే స్థాయిలో వెళ్లిపోతే పార్టీ కకావికలం అయిపోతుందని భావించిన కేసీఆర్.. మంత్రివర్గంలో కీలక మార్పులు చేశారు. ఈటల రాజేందర్ నిర్వహించిన వైద్య ఆరోగ్యశాఖను హరీష్ రావుకు కట్టబెట్టారు. ఇక అప్పటినుంచి మొన్నటిదాకా హరీష్ రావుకు వచ్చిన ఇబ్బందేం లేకుండా పోయింది. అయితే తాజాగా హరీష్ రావు అంతగా ప్రగతిభవన్ వెళ్లడం లేదని ప్రచారం జరుగుతున్నది. నిన్నటికి నిన్న యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై జరిగిన సమావేశంలో కేవలం కేటీఆర్ మాత్రమే ప్రగతిభవన్ వెళ్లారు. అంటే ఈ లెక్కన హరీష్ రావుకు ఈసారి స్థానచలనం తప్పదని తెలుస్తోంది..