Jawan Movie Trolls: సినిమాలన్నీ అడ్డంగా తన్నేసిన తర్వాత ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన పఠాన్ సినిమా షారుక్ ఖాన్ కు, బాలీవుడ్ కు కొత్త జవసత్వాన్ని ఇచ్చింది. వందల కోట్లు కలెక్ట్ చేసింది (వీటిపై అనుమానాలు ఉన్నాయి).. ఈ ఊపులో అతడు జవాన్ అనే పేరుతో తన సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ లో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కోలీవుడ్లో మంచి పేరున్న అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ఊహించినట్టుగానే ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఈ కథనం రాసే సమయానికి నాలుగు కోట్ల మంది వీక్షించారు. ఈ ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాల్లో పాత సినిమాల వాసనలు కనిపిస్తున్నాయి. దీంతో నెటిజన్లు రెచ్చిపోతున్నారు. ” ఇదంతా తెలిసే చేశారా? ప్రేక్షకులను వెర్రి వాళ్ళు అనుకున్నారా” అని కామెంట్లు చేస్తున్నారు.
భారీ తారాగణం
షారూక్ ఖాన్, నయనతార, దీపికా పదుకొనే, విజయ్ సేతుపతి లాంటివారు ఈ జవాన్ సినిమాలో నటిస్తున్నారు. పఠాన్ లాంటి 1000 కోట్ల సినిమా తర్వాత షారుక్ చేస్తున్న చిత్రం కూడా ఇదే. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వరుస పరాజయాల నేపథ్యంలో బాలీవుడ్ కూడా దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కూడా ఫాన్సీ రేటుకు అమ్ముడుపోయినట్టు ప్రచారం జరుగుతున్నది. అయితే అంచనాలు ఆకాశాన్నంటే స్థాయిలో ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో అమాంతం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే విడుదలైన ట్రైలర్ మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు. దీనికి నెటిజన్లు చేస్తున్న కామెంట్లే నిదర్శనమని గుర్తు చేస్తున్నారు.
ఎలి వేషన్ సీన్లు
కేజిఎఫ్ సిరీస్ తర్వాత దర్శకుల ఆలోచన విధానం పూర్తిగా మారిపోయింది. కథ చెప్పే దానికంటే హీరోల ఎలివేషన్లకు భారీగా ప్రాధాన్యమిస్తున్నారు. జవాన్ సినిమాలోనూ అదే కనిపించింది. ట్రైలర్ ను డైరెక్టర్ అట్లీ చాలా వరకు ఎలివేషన్ సీన్స్ తో నింపేశాడు. కాస్త స్టోరీని మాత్రం చెప్పి చెప్పినట్టుగా చూపించేశాడు. జైల్లో పుట్టి పెరిగిన ఓ కుర్రాడు (షారూక్) గతంలో తల్లికి జరిగిన అన్యాయంపై పగ తీర్చుకునేందుకు సిద్ధమవుతాడు. అతడి బాధకు కారణమైన వారిని చంపాలనుకుంటాడు.దీని కోసం ఎంతకైనా తెగిస్తాడు. మరోవైపు ఇతడిని పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ (నయనతార), విలన్ (విజయ్ సేతుపతి) వేరువేరుగా ప్రయత్నిస్తుంటారు. తర్వాత ఏం జరిగిందనేది మిగతా స్టోరీ. జవాన్ ట్రైలర్ ఓ వర్గం ప్రేక్షకులకు నచ్చవచ్చు. కానీ షారుక్ ముఖానికి సగం మేకప్ అచ్చం అపరిచితుడు సినిమాలోని విక్రమ్ ను గుర్తు చేస్తోంది. చిన్నపిల్లాడిని గాల్లో ఎత్తి పట్టుకునే సీన్ బాహుబలి మొదటి భాగాన్ని స్ఫురణకు తెస్తోంది. ఇక షారుక్ తన శరీరాన్ని వస్త్రంతో కప్పేసుకున్న సన్నివేశం మూన్ నైట్ వెబ్ సిరీస్ కు గుర్తుకు తెస్తోంది. ట్రైలర్ లో కనిపించిన అమ్మాయిల గ్యాంగ్ విజయ్ బిగిల్ సినిమాను జ్ఞాపకం చేస్తోంది. చివరిలో షారుక్ గుండుతో కనిపించే సన్నివేశం శివాజీలో రజనీకాంత్ ను కళ్ళ ముందు ఉంచుతోంది. వీటిని చూసే నెటిజన్లు మండిపడుతున్నారు. కాపీ సీన్లతో ఎలా ప్రేక్షకులకు ఎంటర్టైన్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అన్నట్టు నిన్న రిలీజ్ అయిన జవాన్ ట్రైలర్ టాప్ ట్రెండింగ్ లో కొనసాగుతుండడం విశేషం.
