GVL Narasimha Rao: బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. వచ్చే ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే బీచ్ రోడ్ లో ఓ ఇల్లును తీసుకున్న ఆయన తరచూ విశాఖ వస్తున్నారు. రైతు బజార్లో కూరగాయల కొనుగోలు అంటూ హల్ చల్ చేస్తున్నారు. మీడియాకు కంటపడే ప్రయత్నం చేశారు. తాజాగా ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో భారీగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ తప్పకుండా చేస్తానని విశాఖ వాసులకు సంకేతాలు ఇచ్చారు.
విశాఖ లోక్ సభ స్థానానికి పెద్ద పోటీ ఉంది. ఇక్కడ ఇప్పటికే వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ లక్ష్మిని నియమించారు. టిడిపి, జనసేన కూటమి బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చూస్తోంది. మరోవైపు సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సైతం ఇక్కడే పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇన్ని పరిణామాల నడుమ బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ తన వంతు ప్రయత్నాలు చేయడం విశేషం. అయితే ఆయన తనకు తాను బిజెపి అభ్యర్థిగా ప్రకటించుకున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బిజెపి కూటమిలోకి వస్తే.. విశాఖ లోక్ సభ స్థానాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. ఇది తెలిసే జివిఎల్ విశాఖపై మమకారం పెంచుకున్నారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ బీజేపీ పొత్తుకు ముందుకు వచ్చినా.. జివిఎల్ అభ్యర్థి విషయంలో మాత్రం అనుకున్న స్థాయిలో ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు. ఎందుకంటే పురందేశ్వరి రూపంలో బలమైన ప్రత్యామ్నాయం ఉంది.
అయితే జీవీఎల్ నరసింహారావు కొంచెం అతి చేస్తున్నారన్న ప్రచారం ఉంది. విశాఖపట్నం ప్రత్యేక దృష్టి సారించి రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. పార్లమెంట్ స్థానం పరిధిలో నిత్యం పర్యటనలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు నిలయమైన విశాఖలో పరిశ్రమల అధిపతులతో నిత్య సమావేశాలు పెడుతున్నారు. తనకు తాను కేంద్రం ఏపీ దూతగా పంపించిందని చెప్పుకొస్తున్నారు.అయితే ఈ పరిణామ క్రమంలో ఆయన వసూలు పర్వానికి దిగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తాజాగా ఆయన నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు కోట్లాది రూపాయలు వసూలుకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన స్పాన్సర్ గా ఉంది. వీటితో పాటు చాలా సంస్థలు కో స్పాన్సర్స్ గా వ్యవహరిస్తున్నాయి. ప్రతి సంస్థ నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారని.. మొత్తం కోట్లాది రూపాయలు చేతులు మారాయి అన్న ఆరోపణలు విశాఖ నగరంలో గుప్పుమంటున్నాయి. అయితే జీవీఎల్ ఎంత చేస్తున్నా స్థానిక బిజెపి నాయకులు మాత్రం ఆయనతో మమేకం కావడం లేదు. దీంతో తెర వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన జీవీఎల్ పదవీకాలం మరో రెండు నెలల్లో ముగియనుంది. అయితే విశాఖలో రాజకీయాలు మొదలుపెట్టిన జీవీఎల్ పై వసూలు ఆరోపణలు రావడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై హై కమాండ్ కు ఫిర్యాదులు వెల్లువెత్తినట్లు తెలుస్తోంది. మరి పెద్దలు ఎటువంటి చర్యలకు దిగుతారో చూడాలి.