PM Modi GST Utsav: వన్ నేషన్.. వన్ టాక్స్ పేరుతో మోడీ ప్రభుత్వం జీఎస్టీని అమల్లోకి తీసుకువచ్చింది. అప్పట్లో అనేక రకాల స్లాబులు ఇందులో ఉండేవి. వీటివల్ల ప్రభుత్వానికి ఆదాయం భారీగానే వచ్చినప్పటికీ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతూ ఉండేవారు. అనేక సందర్భాలలో స్లాబులు మార్చినప్పటికీ అంతగా ప్రజలకు అవి ఉపయోగకరంగా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కేంద్రం జీఎస్టీ విషయంలో సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఐదు శాతం, 18% పన్నులు మాత్రమే ఉంటాయని ప్రకటించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి వెల్లడించినప్పటికీ.. ఎందువల్ల ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.. ఆ నిర్ణయం వల్ల ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి.. అనే విషయాలను నరేంద్ర మోడీ వెల్లడించారు.
పన్నుల విధానం సరళికృతంగా ఉండడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయి. ఈ విధానాన్ని అనేక దేశాలు అనుసరిస్తున్నాయి. ఇదే మార్గాన్ని అనుసరించడం వల్ల పెట్టుబడులు పెరుగుతాయని భారత్ భావిస్తోంది. దీనికి తోడు ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ గా భారత్ ఉంది. అందువల్లే జీఎస్టీ సంస్కరణల వల్ల బహుళ జాతి సంస్థలు పెట్టుబడులు పెడతాయని.. ప్రజల వద్ద డబ్బు మిగులుతుంది కాబట్టి కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. జీఎస్టీ స్లాబులలో 5, 18 శాతం మాత్రమే పన్నుల విధానం అమలులో ఉంటుంది. దీనివల్ల ఆత్మ నిర్భర్ సాకారం అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ఇప్పటికే వన్ నేషన్ వన్ టాక్స్ వల్ల పన్నుల విధానంలో ప్రక్షాళన మొదలైందని.. ఇప్పుడు కొత్తగా స్లాబులను తగ్గించడం వల్ల అది మరింత సరళీకృతం అవుతుందని కేంద్రం భావిస్తోంది.
కేంద్రం ఇప్పటికే 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు ఇచ్చింది. ప్రజలు ఉపయోగించే అనేక రకాల నిత్యావసరాలపై ఐదు శాతం మాత్రమే పన్ను ఉంటుంది. 12 శాతం స్లాబ్ లో ఉన్న 99 వస్తువులు ఐదు శాతం పన్ను పరిధిలోకి వచ్చాయి. ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్, మెడిసిన్ ధరలు చాలా వరకు తగ్గుతాయి. దీనివల్ల ప్రజలపై ఆర్థికంగా భారం తగ్గుతుందని.. ఈ వి భాగాలలో భారీగా పెట్టుబడులు వస్తాయని కేంద్రం భావిస్తోంది. ఎందుకంటే భారతదేశంలో నిత్యవసరల మార్కెట్ అంతకంతకు పెరుగుతోంది. దాదాపు ఈ విభాగంలో ప్రతి ఏడాది రెట్టించిన స్థాయిలో వృద్ధి నమోదవుతోంది. ఈ మార్కెట్ విలువ దాదాపు 5 లక్షల కోట్ల వరకు ఉంది. అందువల్ల ఈ విభాగంలో సంస్కరణలు తీసుకొస్తే పెట్టుబడులకు మార్గం లభిస్తుందని కేంద్రం అంచనా వేస్తోంది. మరోవైపు ఔషధాలు.. ఆరోగ్య బీమా విషయంలో కూడా కేంద్రం పన్నులు తగ్గించిన నేపథ్యంలో.. ఈ విభాగాలలో కూడా పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. మొత్తంగా కొంతకాలంగా పన్నుల తో ఇబ్బంది పడిన ప్రజలకు కేంద్రం ఉపశమనం ఇచ్చింది. బీహార్ ఎన్నికలవేళ దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన బహుమతిగా దీనిని అభివర్ణించవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.