https://oktelugu.com/

Group 2 : గ్రూప్_2 కేసీఆర్ పీచే మూడ్.. పాపం ‘నమస్తే తెలంగాణ’..

మా సార్ మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయని మొన్న రాసుకొచ్చిన నమస్తే తెలంగాణ..ఇప్పుడు ఇలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.

Written By:
  • Rocky
  • , Updated On : August 13, 2023 / 05:11 PM IST
    Follow us on

    Group 2 : పై వార్త చూశారు కదా.. “విద్యార్థులకు రాంగ్ కోచింగ్” పేరిట నమస్తే తెలంగాణలో గురువారం ప్రచురితమైన ఒక కథనం అది. ఇది ప్రచురితం అయ్యాక చాలా మంది గ్రూప్ 2 రాసే నిరుద్యోగులు నమస్తే తెలంగాణ ఆఫీస్ కు ఫోన్ చేసి తిట్టిపోశారు. అనంతరం నమస్తే తెలంగాణ పత్రిక ప్రతులను కూడలిలో దహనం చేసి నిరసన తెలిపారు.  సీన్ కట్ చేస్తే గ్రూప్-2 పరీక్షను వాయిదా వేస్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలను ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వాస్తవానికి ఇలాంటి విషయాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వివరించాలి. అదేం దౌర్భాగ్యమో తెలియదు గానీ విద్యాశాఖకు సంబంధించిన విషయాలను ఐటీ శాఖ మంత్రి చెబుతాడు. సరే ఆ విషయం పక్కన పెడితే.. గ్రూప్ 2 విషయంలో కొందరి ప్రయోజనం కోసమే వాయిదా వేస్తున్నారని తలా తోకా లేని కథనాన్ని ప్రచురించిన నమస్తే తెలంగాణ.. తన బాస్ నిర్ణయం తీసుకోవడంతో దెబ్బకు తోక ముడిచింది.. ఆదివారం నాటి సంచికలో ఎక్కడా కూడా గ్రూప్ 2 పరీక్ష వాయిదాను ప్రచురించలేదు. అంటే తాను రాసిన కథనాన్ని కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల.. కెసిఆర్ చేసిన ప్రకటనను కూడా నమస్తే తెలంగాణ పట్టించుకోలేదు అని అనుకోవాలా?

    వాస్తవానికి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయాల్సిన ఉద్యోగాలు వేలల్లో ఉన్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అవి భర్తీకి నోచుకోకుండా పోతున్నాయి. ఒకవేళ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్వహించే నియామక పరీక్షల్లో ప్రశ్న పత్రాలు లీక్ కావడం ప్రభుత్వ తీరును తేట తెల్లం చేస్తోంది. గ్రూప్_1 పరీక్షకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇందుకు ఒక స్పష్టమైన ఉదాహరణ. తర్వాత నిర్వహించిన పరీక్ష లోనూ బయోమెట్రిక్ హాజరును అధికారులు నమోదు చేయలేదు. పైగా పరీక్ష ముగిసిన తర్వాత కూడా కొంతమంది ఓఎంఆర్ షీట్లు అదనంగా యాడ్ అయ్యాయని ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నుంచి దీనిపై ఎటువంటి స్పందన కూడా రాలేదు. ఇక అప్పట్లో పేపర్ లీక్ అయినప్పుడు మంత్రి కేటీఆర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. అభ్యర్థులకు ఉచితంగా కోచింగ్, భోజన సదుపాయం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అని దానిని నిలబెట్టుకోలేకపోయారు. ఇక గ్రూప్ _1 పరీక్ష నేపథ్యంలో ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు నమోదు చేయకపోవడంతో అనుమానం వచ్చిన అభ్యర్థులు గ్రూప్ 2 విషయంలోనూ ఇదే జరుగుతుందని భావించి కోర్టు మెట్లు ఎక్కారు. పరీక్ష తేదీలు మార్చాలని కోర్టులో బలంగా వాదించారు. అభ్యర్థుల ఆందోళనకు మద్దతుగా బహుజన్ సమాజ్వాది పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ కోదండరాం వంటి వారు ఆందోళనకు దిగారు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకొని తన నిర్ణయాన్ని వెల్లడించింది.

    హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎదురుదెబ్బ తప్పదని భావించి ప్రభుత్వం వెనకడుగు వేసింది. ప్రణాళిక లోపంతోనే ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించి పరీక్షను వాయిదా వేసింది. ఇక హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో ట్విట్టర్లో మంత్రి కేటీఆర్ దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయడంతో ప్రభుత్వం మీద తమ ఆందోళన ఫలించిందని నిరుద్యోగులు అంటున్నారు. వాస్తవానికి ఈనెల 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. అభ్యర్థులు కూడా పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలని కోరడంతో నవంబర్లో నిర్వహించే అవకాశం ఉంది. నిజానికి ఆగస్టు నెలలోనే గురుకుల బోర్డు తో పాటు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షలు కూడా ఉన్నాయి. ఈ పరీక్షలను కనీసం మూడు నెలల పాటు వాయిదా వేయాలంటూ అభ్యర్థులు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా అశోక్ నగర్ లోని పలు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు కూడా ఆందోళన నిర్వహించారు. వీరికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కోదండరాం వంటి వారు మద్దతు పలకడంతో పరిస్థితి ఒక్కసారిగా తీవ్రంగా మారిపోయింది.. మరోవైపు ఈనెల 14 తేదీలోపు నిర్ణయం చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యార్థులకు మద్దతుగా ఆందోళనకు దిగాలని కాంగ్రెస్ పార్టీ భావించడంతో.. ప్రభుత్వం ముందు జాగ్రత్తగా వెనక్కి తగ్గింది. మూడు నుంచి నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేస్తే ఎన్నికల తర్వాతే జరపాల్సి ఉంటుందని తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు ఇప్పటికే ఒక అంచనాకి వచ్చాయి. ఇదే విషయాన్ని హైకోర్టులోనూ తెలపాలని భావించాయి. అయితే మొండిగా ముందుకెళ్తే మరింత ఇబ్బందికర పరిస్థితి వస్తుందని అంచనా వేసిన ముఖ్యమంత్రి.. అన్ని విషయాలను బేరీజు వేసుకొని వాయిదా విషయాన్ని ప్రకటించారు. అన్నట్టు మా సార్ మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాయని మొన్న రాసుకొచ్చిన నమస్తే తెలంగాణ..ఇప్పుడు ఇలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.