లాక్‌డౌన్ ముగిసినప్పటి నుంచి నిత్యావసర ధరలకు అదుపు లేకుండా పోయింది. ఏ వస్తువు ధర చూసినా ఆకాశాన్ని తాకింది. దీంతో సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఒకవిధంగా చెప్పాలంటే గతేడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం రేట్లు డబుల్ అయ్యాయని చెప్పాలి. అయితే.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇంత కన్నా ఘోరమైన పరిస్థితి ఉంది. దేశంలోనే అధిక రేట్లు అక్కడ ఉన్నాయంటే నమ్మాల్సిన విషయం.
ఆంధ్రప్రదేశ్‌లోని ఏ పట్టణాల్లో అయినా.. ఏ గ్రామంలో అయినా నిత్యావసర ధరలు భగ్గుమంటున్నాయట. కర్ణాటక రాష్ట్రంలో పెరుగుదల ఆరుశాతం ఉంటే.. తెలంగాణలో అది ఏడు శాతం కాగా.. ఏపీలో అయితే ఏకంగా ఎనిమిది శాతం పెరుగుదల రేటు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. కర్ణాటక, తెలంగాణలో మెట్రో సిటీలు ఉండగా.. అక్కడ రేట్లు అధికంగా ఉన్నాయంటే అది కామన్. కానీ.. ఎలాంటి మెట్రో సిటీలు లేని ఏపీలో ఇంత రేట్లు పలకడం ఏంటని అందరూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గణాంకాలు దీనిని నిర్ధారించాయి.
దేశంలో నిత్యావసర ధరలతోపాటే భవన నిర్మాణ మెటీరియల్ రేట్ల సైతం విపరీతంగా పెరిగిపోయాయి. అయితే.. సామాన్య ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడేవి కేవలం నిత్యావసర వస్తువులే. వాటి రేట్లే రాష్ట్రంలో భగ్గుమంటుండడంతో సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. ఫలితంగా తాము తినే ఆహారంలో క్వాలిటీని తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలా.. క్వాలిటీని తగ్గించుకుంటే రేపు ఆరోగ్యంపైనే ఆ ప్రభావం పడే అవకాశాలు లేకపోలేదు.
ఇదిలా ఉండగా.. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా పేరు గాంచిన ఏపీలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం విచిత్ర పరిస్థితి. సాధారణంగా మన దగ్గర క్రాప్ ఉంటే వాటి రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. కానీ.. ఏపీలో మాత్రం అనూహ్యంగా అన్నింటి ధరలూ ఆకాశాన్ని తాకుతున్నాయి. దీన్ని బట్టి చూస్తుంటే వ్యాపారులే ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నట్లుగా అర్థం అవుతోంది. కానీ.. ప్రభుత్వం మాత్రం వీరి పట్ల ఎలాంటి చర్యలు చేపట్టడం లేదనే విమర్శలున్నాయి. ధరలను కంట్రోల్ చేయకుంటే దేశంలోనే ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా నిలిచిపోనుంది.