జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఇప్పుడు మంత్రి కేటీఆర్ భవిష్యత్‌ను నిర్ణయించబోతున్నాయా..? ఈ ఎన్నికలే ఆయనకు రెఫరెండం కానున్నాయా..? గ్రేటర్ బాధ్యతలు తీసుకున్న కేటీఆర్.. పార్టీకి మెజార్టీ సీట్లు తెచ్చిపెడితే యువరాజుకు పట్టం కట్టబోతున్నారా..? ఇప్పుడు రాష్ట్రంలో ఇదే హాట్ టాపిక్ నడుస్తోంది.
Also Read: సీఎం కేసీఆర్‌కు పీఎంవో ఝలక్
2014లో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2016 జనవరిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరిగాయి. అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ గ్రేటర్ ఎన్నికల సారథ్య బాధ్యతలు ఎత్తుకున్నారు. 150 డివిజన్లకుగాను టీఆర్‌ఎస్ రికార్డుస్థాయిలో 99 చోట్ల గెలిచి మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకుంది. దీంతో.. సీఎం కేసీఆర్ వెంటనే ఆయనకు కీలకమైన పురపాలక శాఖను కట్టబెట్టారు. ఇక, అసెంబ్లీ ముందస్తు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 88 స్థానాల్లో గెలిచిన తర్వాత కేటీఆర్‌ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి వరించింది. అప్పుడే ఫెడరల్ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలమవుతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో.. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపడతారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత కేంద్ర రాజకీయాల్లో క్రియాశీలం అవుతానని కేసీఆర్ మరోసారి ప్రకటించారు. దాంతో.. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తే.. కేటీఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టటం లాంఛనమేనని, సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకానికి ఇంతకు మించిన తరుణం ఉండబోదని టీఆర్‌ఎస్‌కు చెందిన కొందరు ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు.
అయితే.. గ్రేటర్ ఎన్నికల్లో భిన్న ఫలితాలొస్తే యువరాజు పట్టాభిషేకానికి మరింత సమయం పడుతుందనే వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. జీహెచ్‌ఎంసీ ఎన్నికలను తెలంగాణలో భవిష్యత్తు రాజకీయాలకు దిక్సూచిగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒక్క టీఆర్‌ఎస్‌కు మాత్రమే కాదు.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కూడా ఈ ఎన్నికలు టర్నింగ్ పాయింట్‌గా మారనున్నాయి. ఇందుకు కారణాలూ లేకపోలేవు. గ్రేటర్లో మేజిక్ మార్కు సాధిస్తే.. టీఆర్‌ఎస్‌కు తిరుగుండదు. దుబ్బాకలో ఓటమిని హరీశ్‌కు ఎదురు దెబ్బగా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్రేటర్లో విజయం సాధిస్తే కేటీఆర్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడానికి కేసీఆర్‌కు కూడా ఇంతకు మించిన తరుణం ఉండబోదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read: బీజేపీ, జనసేనల మాటల యుద్ధం
ఒకవేళ టీఆర్‌ఎస్‌కు సీట్ల సంఖ్య తగ్గి.. బీజేపీకి కనుక పెరిగితే రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు తప్పవు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ తన స్థానాన్ని పదిలం చేసుకోనుంది. అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ మరింత దూసుకుపోనుంది. అటు కాంగ్రెస్ నుంచే కాదు.. ఇటు టీఆర్‌ఎస్ నుంచి కూడా ఆ పార్టీలోకి వలసలు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ, గ్రేటర్‌పై కాషాయ జెండా ఎగరేస్తే మాత్రం తెలంగాణలో ఆ పార్టీకి తిరుగుండదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత గడ్డు పరిస్థితి ఎదుర్కోక తప్పదని తెలిపాయి. ఇదిలా ఉంటే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు అత్తెసరు మెజారిటీ రావడం లేదా ఎక్స్ అఫీషియో ఓట్లతో మేయర్ పీఠాన్ని దక్కించుకోవాల్సి పరిస్థితి వస్తే ప్రభుత్వ వ్యతిరేకత మరోసారి తెరపైకి రానుంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్