Homeజాతీయ వార్తలుChandrababu: చంద్రబాబుకు గ్రేటర్ హైదరాబాద్ రిటర్న్ గిఫ్ట్

Chandrababu: చంద్రబాబుకు గ్రేటర్ హైదరాబాద్ రిటర్న్ గిఫ్ట్

Chandrababu: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలావరకు ఆంధ్రా సెటిలర్ ఓటర్లే ఉంటారు. కూకట్ పల్లి నుంచి మొదలు పెడితే శేరిలింగంపల్లి వరకు దాదాపు ఇదే పరిస్థితి ఉంటుంది. 2014 ఎన్నికల్లో అప్పటి టిఆర్ఎస్ ను ఈ ఓటర్లు అంతంత మాత్రమే ఆదరించారు. కానీ అప్పట్లో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ నుంచి బలమైన సపోర్ట్ లభించడంతో సెటిలర్ ఓటర్లు మనసు మార్చుకున్నారు. ఆ తర్వాత జరిగిన జిహెచ్ఎంసి ఎన్నికల్లో రెండో మాటకు తావులేకుండానే టీఆర్ఎస్ కు అధికారాన్ని కట్టబెట్టారు. ఏకంగా 99 స్థానాలు ఇచ్చారు. ఆ తర్వాత కొంతకాలానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ఆంధ్ర సెటిలర్ ఓటర్లు భారత రాష్ట్ర సమితికి జై కొట్టారు. కూకట్ పల్లి స్థానంలో టిడిపి నందమూరి సుహాసిని రంగంలోకి దింపినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సహజంగా ఈ పరిణామం అక్కడి టిడిపి నాయకులనే కాదు.. భారత రాష్ట్ర సమితి నాయకులను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.

చంద్రబాబు అరెస్టుతో..

అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు ని అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలో నిరసనలు వెల్లువెత్తాయి.. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, టిడిపి సానుభూతిపరులు రోడ్లమీదకు వచ్చి ధర్నాలు చేశారు. ఐటీ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో ఇలాంటి ధర్నాలు చేస్తే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని.. ధర్నాలు చేసుకోవాలనుకుంటే ఏపీకి వెళ్లాలని అప్పటి ఐటీ మంత్రి కేటీఆర్ సూచించారు. సహజంగానే ఈ వ్యాఖ్యలను పచ్చ మీడియా బాగా హైలైట్ చేసింది. కాంగ్రెస్ కూడా ఇదే విషయాన్ని పదేపదే ప్రస్తావించింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యల వల్ల ఎన్నికల్లో తమకు లాభం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ భావించింది.. అయితే ఆ వ్యాఖ్యలు అనంతరం కేటీఆర్ కూడా ఒక అడుగు వెనక్కి వేసినట్టు కనిపించింది. పచ్చ మీడియా గా భావించే కొన్ని చానల్స్ కు ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు కూడా. అయితే చాలామంది గ్రేటర్ పరిధిలో ఈసారి చాలావరకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు.. కానీ అక్కడ జరిగిన సీన్ వేరే విధంగా ఉంది.

అరెస్టు సమర్ధించినట్టేనా

గ్రేటర్ పరిధిలో చాలావరకు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపించలేదు. ముఖ్యంగా శేరిలింగంపల్లి స్థానంలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి వివేక్ ఏకంగా 80 వేల ఓట్ల పై చిలుకు మెజారిటీ సాధించారు. ఇక అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, ప్రకాష్ గౌడ్, వంటి భారత రాష్ట్ర సమితి నాయకులు ఆంధ్ర ప్రాంత ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో మరోసారి ఎగరవేశారు. చంద్రబాబు అరెస్టు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ప్రభావం ఈ నియోజకవర్గాలపై ఉంటుందని పచ్చ మీడియా పదేపదే వ్యాఖ్యానించింది. అదే దిశగా వార్తలు కూడా రాసింది. కానీ ఎన్నికల సమయంలో వాస్తవ పరిస్థితి వేరే విధంగా ఉంది. ఈ నియోజకవర్గాల పరిధిలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా సెటిలర్ ఓటర్లు భారత రాష్ట్ర సమితికి జై కొట్టారు. 2018 నాటి ఫలితాలను పునరావృతం చేశారు.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం గెలిచిన నేపథ్యంలో చంద్రబాబు కెసిఆర్ కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారని టిడిపి నాయకులు అంటున్నారు. మరి అదే ఆంధ్రమూలాలు గల ఓటర్లు ఉన్న భారత రాష్ట్ర సమితికి ఓటు వేశారు. అంటే దీనిని చంద్రబాబుకు గ్రేటర్ హైదరాబాద్ ఓటర్లు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అనుకోవచ్చా?! అంటే దీనికి అవును అనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు గ్రేటర్ ఓటర్లకు నచ్చాయని.. అందుకే వారు భారత రాష్ట్ర సమితికి జై కొట్టారని చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఓటర్ల తీర్పును సాక్షి పత్రిక ఒక విధంగా రాస్తే.. పచ్చ పత్రికలు మరో విధంగా రాశాయి. ఏది ఏమైనప్పటికీ గ్రేటర్ ఓటర్లు ఇచ్చిన తీర్పుతో భారత రాష్ట్ర సమితి నాయకులు ఖుషి అవుతున్నారు. ఇదే సమయంలో మిగతా ప్రాంతాల్లో ఓడిపోవడం పట్ల కలత చెందుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular