
ఏపీలో మొత్తం 58.22లక్షల మంది వైఎస్‌ఆర్ పెన్షన్ దారులుండగా ఒక్కరోజే 90 శాతం మందికి పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత గ్రామ వాలంటీర్లకే దక్కుతుంది. నిన్న ఒక్కరోజే 53లక్షల మంది లబ్ధిదారులకు రూ.1300కోట్లు వాలంటీర్లు పంపిణీ చేశారు. కోవిడ్-19 నియంత్రణ చర్యల్లో భాగంగా పెన్షనర్ల బయోమెట్రిక్ వేయకుండా ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం మొబైల్ యాప్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఈ యాప్ ద్వారా జియోట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను వాలంటీర్లు ఫోన్లలో అప్ లోడ్ చేస్తూ పెన్షన్లను పంపిణీ చేశారు. లాక్‌డౌన్ నిబంధల కారణంగా ఎక్కడైనా పెన్షనర్లు ఇతర ప్రాంతాల్లో ఉండి పోయినట్లయితే వారిని కూడాగుర్తించి పోర్టబిలిటీ ద్వారా పెన్షన్ సొమ్మును అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న హెచ్‌ఐవి, డయాలసిస్,పేషెంట్లకు డిబిటి విధానంలో శుక్రవారం పెన్షన్ సొమ్మును జమచేశారు. ఎవరైనా మేనెల పెన్షన్ సొమ్మును అందుకోలేక పోతే వారికి జూన్ నెలలో అందజేసే సమయంలో ఈ పెన్షన్ కూడా కలిపి అందిస్తామని సెర్ప్ సిఈఓ పి.రాజబాబు వెల్లడించారు
పింఛన్ కోసం రూ.1421.20కోట్లు ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 2,37,615 మంది వాలంటీర్లు పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజునే 53లక్షలకు పైగా పెన్షన్ దారులకు రూ.1300 కోట్లకు పైగా నగదును పంపిణీ చేయడం అభినందనీయమని రాష్ట్ర గ్రామీణాభివృద్దిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సచివాలయ, వాలంటీర్ల వ్యవస్థ సాధిస్తున్న ఫలితాలకు పెన్షన్ల పంపిణీయే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.