
దేశంలో కరోనా ఎంట్రీతో లాక్ డౌన్ అమలు చేస్తున్న సంగతి తెల్సిందే. రేపటితో లాక్డౌన్ ముగుస్తుందనగా ప్రధాని మోదీ మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుందని మంగళవారం ప్రకటించారు. ఏప్రిల్ 20వరకు లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు కానుందని తెలిపారు. ఆ తర్వాత పరిస్థితులను అంచనా వేసి కొన్ని సడలింపులు ఉంటాయని ప్రధాని మోదీ ప్రకటించిన సంగతి తెల్సిందే. అయితే లాక్ డౌన్ అమలు వల్ల మరోవైపు భారత ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. దీంతో లాక్డౌన్ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్రం పని గంటలను పెంచనుందని ఎకనమిక్స్ టైమ్స్ కథనం ప్రచురించింది.
కేంద్ర ప్రభుత్వం పని గంటల మార్పునకు ఆర్డినెన్స్ తీసుకువచ్చే ఛాన్స్ ఉందని ఎకనమిక్స్ టైమ్ పేర్కొంది. లాక్ డౌన్ వల్ల కార్మికులకు సొంత ఊళ్లకు వెళ్లడంతో కొరత ఏర్పడింది. ఇదే సమయంలో నిత్యవసర వస్తువులకు గిరాకీ పెరిగింది. లాక్డౌన్ వల్ల ఏర్పడిన కార్మికుల కొరత తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మూడు నుంచి 5నెలలు పని గంటలను పెంచాలని ఆలోచిస్తుంది. ఇందుకోసం చట్టాలను కూడా మార్చాలని యోచిస్తోంది. దీంతో రాష్ట్రాలకు పని గంటలు పెంచుకునేందుకు వెసులుబాటు లభిస్తుంది.
కేంద్రం చట్టం చేస్తే కార్మికులు, ఉద్యోగులు 8గంటలు కాకుండా 12గంటలు పని చేయాల్సి రావచ్చు. అంటే వారానికి 48గంటలు కాకుండా 72గంటలు పని చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీస్ చట్టం-1948 ప్రకారంగా వారానికి 48గంటలకు మించి పని చేయడానికి వీల్లేదు. యుక్తవయస్సు ఉన్నవారిని బలవంతంగా పని చేయించడానికి వీల్లేదు. దీంతో ఈ చట్టానికి సవరణ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎవరెవరికీ ఈ చట్టం వర్తిస్తుంది? అనే అంశాలపై క్లారిటీ రావాల్సి ఉంది.