CM KCR – Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వానికి గవర్నర్ కు మధ్య పొసగడం లేదు. వీరి పంచాయితీ ఢిల్లీ వరకు చేరినా కేసీఆర్ లో ఏ మార్పు కనిపించలేదు. దీంతో గవర్నర్ రూటు మార్చారు. ఎన్నాళ్లు సీఎం కోసం వేచి చూస్తాం. మన పని మనం చేసుకుందాం అనే ధోరణిలోకి వచ్చారు. దీంతో కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే బృహత్తర పథకం వేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టే ఉద్దేశంతో మహిళా దర్బార్ నిర్వహించాలని భావించారు. దీని కోసం కార్యాచరణ రూపొందించుకున్నారు. జూన్ 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు ప్రజలు తనను వచ్చి కలిసేందుకు రాజ్ భవన్ వేదికగా చేసుకున్నారు.
ఇటీవల కాలంలో బాలికలపై జరుగుతున్న దురంతాలపై గవర్నర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా? ఉంటే ఈ మానభంగాల మాటేమిటి? అభం శుభం తెలియని బాలికలపై మానవ మృగాలు చేస్తున్న దాడులను లక్ష్యంగా చేసుకుని సర్కారును ఇరుకున పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసమే మహిళా దర్బార్ ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ పాలనపై రోజురోజుకు విమర్శలు వస్తున్న నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక టీఆర్ఎస్ ప్రభుత్వానికి మూడినట్లేననే వాదనలు సైతం వస్తున్నాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ తో పాటు మరో ప్రాంతంలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులు జరగడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేక పడుకుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయినా ప్రభుత్వానికి మాత్రం చలనం లేకుండాపోతోంది. మంత్రి కేటీఆర్ మాది ఎంతో సమర్థవంతమైన పాలన అని చెబుతున్నా ఇలాంటి దారుణాలు ఎందుకు చోటుచేసుకుంటున్నాయో మాత్రం చెప్పడం లేదు. సర్కారు ప్రోద్బలంతోనే మానభంగాలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం ఏం చెబుతుంది? బాధితులకు ఏం న్యాయం చేస్తుందో చెప్పడం లేదు.
దీంతోనే గవర్నర్ సౌందర్య రాజన్ మహిళల కోసం మహిళా దర్బార్ నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు 040-23310521కు ఫోన్ ద్వారా rajbhbavan.hyd@gov.in కు ఈ మెయిల్ చేయడం ద్వారా అపాయింట్ మెంట్ తీసుకోవచ్చని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. దీంతో మహిళలు తమ సమస్యలను గవర్నర్ కు నివేదించి వాటి పరిష్కారానికి మార్గం చేసుకోవాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలో మహిళల సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీనిపై గవర్నర్ ప్రత్యేక దృష్టి సారించారు.
ఇప్పటికే రాజ్ భవన్, ప్రగతిభవన్ మధ్య దూరం పెరగడంతో ప్రస్తుతం గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించంతో ఆ దూరం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ అధిష్టానం కూడా కేసీఆర్ వైఖరిపై గుర్రుగానే ఉంది. దీంతో గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో రాజకీయం ఎటు వైపు వెళ్తుందో తెలియడం లేదు. కానీ ప్రభుత్వానికి మాత్రం ఇది మింగుడుపడటం లేదని తెలుస్తోంది.
Also Read:Trs vs Bjp vs Congress: తెలంగాణ సర్వే: టీఆర్ఎస్ vs బీజేపీ vs కాంగ్రెస్.. గెలుపెవరిది?