Governor Tamilisai: తెలంగాణ ముఖ్యమంత్రి నాలుగేళ్ల క్రితం అసంభవం అన్న ఆర్టీసీ విలీనానికి.. నేడు సంభవం చేశారు. దీనికి చట్టబద్ధత కల్పించేందుకు జూలై 31న కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఆగస్టు 3 నుంచి ప్రారంభించిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈమేరకు బిల్లు పెట్టాలనుకున్నారు. కానీ కేసీఆర్ అనుకున్నట్లు జరిగే అవకాశం కనిపించడం లేదు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనాన్ని ఎవరూ కాదనడం లేదు. కానీ.. ఎన్నికలప్పుడు ఆర్టీసీ కార్మికులు గుర్తుకురావడమే ఇప్పుడు చర్చనీయాంశమైంది. కార్మికుల ఓట్ల కోసం చేసిన విలీనానికి ఇప్పుడు బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది. బిల్లుకు సంబందించిన నోట్‌ను గురువారం ప్రభుత్వం రాజ్‌భవన్‌కు పంపింది. అయితే గవర్నర్ ప్రస్తుతం అందుబాటులో లేరు.
రేపటితో ముగియనున్న సమావేశాలు..
ఇదిలా ఉంటే వర్షాకాల సమావేశాలను కేవలం మూడు రోజులే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విపక్షాలు వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉండడం, నెరవేర్చని హామీలపై ప్రభుత్వం వద్ద సమాధానం లేకపోవడంతో సమావేశాలను వీలైనంత తక్కువ రోజులు నిర్వహించాలనుకున్న ప్రభుత్వం ఆమేరకు మూడు రోజులే అని బీఏసీ సమావేశంలో చెప్పించింది.
టిట్ ఫర్ టాట్..
ఇక రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య రెండేళ్లుగా సాగుతున్న వార్‌లో భాగంగా కీలక సమయంలో గవర్నర్ ప్రభుత్వానికి చెక్ పెడుతున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లులను ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారు. దీంతో ప్రభుత్వం కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. తాజాగా ఆర్టీసీ విలీనం బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం నోట్ పంపింది. ఈ నోట్‌పై గవర్నర్ సంతకం పెడితేనే అసెంబ్లీలో బిల్లు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. కానీ గవర్నర్ తమిళిసై ప్రస్తుతం పాండిచ్చేరిలో ఉన్నారు. కేంద్రపాతి ప్రాంతమైన పాండిచ్చేరికి తమిళిసై ఇన్‌చార్జి గవర్నర్ కూడా. మరో రెండు రోజులు అక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఈ సమావేశాల్లో బిల్లు పెట్టాలంటే గవర్నర్ ఆమోదం తప్పనిసరి.
ప్రభుత్వం ముందు రెండు ఆప్షన్లు..
ప్రస్తుతం ప్రభుత్వం ముందు రెండు అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలంటే.. అసెంబ్లీ సమావేశాలను పొడిగించాలి. ఇక రెండో ఆప్షన్.. గవర్నర్ వచ్చి సంతకం చేసిన తర్వాత అసెంబ్లీని సమావేశపర్చాల్సి ఉంటుంది. ఇలా అయితేనే ఆర్టీసీ బిల్లు ఆమోదం పొందే అవకాశం ఉంది. రాజ్‌భవన్, ప్రగతి భవన్ మధ్య వార్ నేపథ్యంలో అసెంబ్లీలో ఆర్టీసీ విలీన బిల్లు ప్రవేశపెట్టడంపై ఉత్కంఠం నెలకొంది.
కార్మికులను రెచ్చగొట్టే యోచనలో బీఆర్‌ఎస్..
అసెంబ్లీలో బిల్లు పెట్టకుండా గవర్నర్ అడ్డుకుంటున్నారని ఆర్టీసీ కార్మికులను రెచ్చగొట్టాలన్నా ఆలోచనలో బీఆర్‌ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈమేరకు అంతర్గతంగా ఆదేశాలు వెళ్లాయని సమాచారం. రేపటి వరకు గవర్నర్ సంతకం చేయకుంటే.. ఆదివారం లేదా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్‌ఎస్ నేతలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తద్వారా గవర్నర్ పెత్తనం, బీజేపీ తీరును ఎండగట్టవచ్చన ఆలోచనలో బీఆర్‌ఎస్ ఉన్నట్లు తెలుస్తోంది.