Homeఆంధ్రప్రదేశ్‌ప్రజారోగ్యంపై పట్టింపేది?

ప్రజారోగ్యంపై పట్టింపేది?

public healthప్రజారోగ్యాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు అథోగతి పాలవుతున్నారు. వైద్యమో రామచంద్ర అని అల్లాడుతున్నారు. ఏ ఒక్క నాయకుడు కూడా ప్రజల సమస్యల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. దీంతో వ్యవస్థ అంతా అతలాకుతలమైపోతోంది. వైద్యం అందక ప్రజలు మరణమే శరణంగా దీనావస్థలో బతుకులీడుస్తున్నారు. ఆక్సిజన్, పడకలు దొరకక ప్రాణాలు వదిలేస్తున్నారు. కోట్లాది ప్రజల జీవనగమనం డోలాయమానంలో పడింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారు? వారి ప్రాణాలకు ఎవరు అండగా నిలుస్తారనే ప్రశ్న ఉదయిస్తోంది. ఈ పరిస్థితుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ వేసే ప్రక్రియ సైతం అంత వేగంగా ముందుకు సాగడం లేదు. దీంతో ప్రజలు భయాందోళనలో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేసి ప్రజలకు ఆరోగ్య సేవలందించేందుకు సత్వరమే చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

-ఆసుపత్రుల కొరత
ఆసుపత్రుల కొరత రోగులను వేధిస్తోంది. సరైన స్థాయిలో హాస్పిటళ్లు లేక రోగగ్రస్థులు ఆందోళన చెందుతున్నారు. తమకు ఆరోగ్యం అందని ద్రాక్షేనా అని మథనపడుతున్నారు. తమ ప్రాణాల గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యాడని కన్నీరుమున్నీరవుతున్నారు. ఐదేళ్లకోసారి ఓటు వేసి గెలిపించుకునే నాయకులు కానరాక దుఖాన్ని దిగమింగుతున్నారు.

-ఆక్సిజన్ సమస్య
ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ ప్రధాప పాత్ర పోషిస్తోంది. రోగులకు సత్వరమే వైద్య సేవలందించే క్రమంలో ఆక్సిజన్ ముఖ్య భూమిక అవుతోంది. దీంతో ఆక్సిజన్ దొరకని సమస్య ఉత్పన్నమవుతోంది. నిత్యం ఆక్సిజన్ అందక వేలాది రోగాలు తమ ప్రాణాలు విడుస్తున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పాలకులపై తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు.

-నిధులేవి?
ప్రజారోగ్యాన్ని పరిరక్షించే క్రమంలో రూ. కోట్లు కేటాయిస్తున్నా అవి ఎక్కడికి పోతున్నాయో తెలియడం లేదు. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వినియోగించే నిధులు సద్వినియోగం కావడం లేదనే విమర్శలున్నాయి. పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం ప్రజల పాలిట శాపంగా మారిందనే చెప్పవచ్చు. సర్కారు విడుదల చేస్తున్న నిధులు కాగితాలకే పరిమితమవుతున్నాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో ప్రజలకు ఎవరు జవాబు చెబుతారో చూడాల్సిందే.

-మారాల్సిన వ్యవస్థ
మన వ్యవస్థ మారాల్సిన అవసరం ఏర్పడింది. రూ. కోట్లు పన్నుల రూపంలో కడుతున్న ప్రజానీకానికి జవాబుదారీ ఎవరు? వారికి రోగమొస్తే చావే శరణ్యం. ఎందుకీ దురవస్థ. ఏమిటీ అవస్థ. పాలకుల్లో మార్పు రానంతవరకు ఇలాగే కొనసాగితే ప్రజల ప్రాణాలు కాపాడేదెవరు? వారికి అండగా నిలిచేవారెవరు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక నాయకుడిపై ఉంది.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular