రోజురోజుకు రాజకీయం రంగు మారుతోంది. తానొకటి తలిస్తే దైవమమొకటి తలచిందన్నట్లు ఓటరు వినూత్నంగా తీర్పునిస్తున్నాడు. ఇటీవల జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఈ విషయం ప్రస్ఫుటంగా స్పష్టమైంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని అంచనాలు వెలువడినా తృణమూల్ కాంగ్రెస్ విజయపరంపరతో దూసుకెళ్లింది. ప్రాంతీయ పార్టీల హవా ముందు జాతీయ పార్టీలు కుదేలయిపోయాయి. ఎన్నికల సర్వేలు సైతం బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోరు ఉంటుందని చెప్పినా చివరికి ఫలితాలు తారుమారయ్యాయి. బెంగాల్ దీదీ మరోసారి ప్రభంజనం సృష్టించి అత్యధిక సీట్లు కైవసం చేసుకుని బెంగాల్ పీఠం ఎక్కారు.
– తమిళనాడులో సైతం
తమిళనాడులో కూడా బీజేపీ సహకారంతో పోటీకి దిగిన అన్నా డీఎంకే చిత్తుగా ఓడిపోయింది. అధికారానికి ఆమడదూరంలోనే నిలిచిపోయింది. ఇక్కడ మాత్రం ఎన్నికల సర్వేలు సైతం సంకేతాలు స్పష్టంగానే ఇచ్చాయ. డీఎంకేకే ఓటర్లు మొగ్గు చూపారనే విషయం తేటతెల్లం చేశాయి.
– అస్సాం, పుదుచ్చేరిలో..
అస్సాంలో ఏకపక్షంగా బీజేపీకి తీపి కబురు వినిపించింది. పుదుచ్చేరిలో ప్రాంతీయ పార్టీలతో అధికారంలోకి వచ్చింది. అసోంలో రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు అక్కడి మొగ్గు చూపడంతో బీజేపీ గెలిచింది. పెద్ద రాష్ట్రాలు చిక్కని బీజేపీకి భవితవ్యంపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.
– మోదీ హవా తగ్గిందా?
గతంలో జరిగిన పలు ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన ప్రధాని మోదీ హవా తగ్గిందా అని పలువురు చర్చించుకుంటున్నారు. అస్సాం, పుదుచ్చేరి లో మాత్రమే అధికారం చేజిక్కించుకుని అంతటా అపజయం మూటకట్టుకోవడం మామూలు విషయం కాదు. గతంలో జరిగిన ఎన్నికల్లో మోదీ గాలి వీచినా ఈసారి మాత్రం ఆ పరిస్థితులు కనిపించ లేదు. ఎక్కడా మోదీ బలంలో ఓట్లు పడలేదు. దీంతో బీజేపీలో అంతర్మథనం మొదలైనట్లు తెలుస్తోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో భాగంగా ఎలాంటి వ్యూహాలు రూపొందించాలనే ఆలోచనలో బీజేపీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.
-మింగుడుపడని ఫలితాలు
బీజేపీకి ఈ ఎన్నికల ఫలితాలు మింగుడుపడడం లేదు. కేవలం ఒకే రాష్ట్రం, మరో కేంద్రపాలిత చిన్న ప్రాంతంలో మాత్రమే విజయం సాధించడం నామోషీగా భావిస్తున్నారు. ఓటరును ఎందుకు ప్రసన్నం చేసుకోలేకపోయామనే మీమాంసలో పడిపోయింది. ప్రస్తుత పరిస్థితికి ఎవరు బాధ్యులనే ప్రశ్న ఉదయిస్తోంది. ఏదిఏమైనా ఎన్నికల్లో ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. భవిష్యత్తులో ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరంపై దృష్టి కేంద్రీకరించింది.