Labor Codes: గల్లీలో ఉప్పొంగే మురుగు కాలువ నుంచి.. ఢిల్లీలో మారే ప్రభుత్వం వరకు.. ఇలా ప్రతి విషయాన్ని మీడియా సభ్య సమాజానికి తెలియజేస్తుంది. మీడియా అంటే పాత్రికేయుల సమూహం.. మనదేశంలో జరిగే ప్రతి సంఘటనను వెలుగులోకి తీసుకొస్తారు పాత్రికేయులు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా పాత్రికేయులు పనిచేస్తుంటారు. వాస్తవానికి పాత్రికేయమనేది ప్రైవేట్ రంగంలో ఉంటుంది.. ఈ రంగంలో చెప్పుకునే స్థాయిలో జీతాలు ఉండవు. ఊపర్ షేర్వానీ.. అందర్ పరేషానీ అన్నట్టుగా పాత్రికేయుల పరిస్థితి ఉంటుంది..
గతంలో మీడియా అంటే కేవలం పత్రికలు మాత్రమే ఉండేవి.. ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగిపోయింది. ఎలక్ట్రానిక్, డిజిటల్, వెబ్.. ఇలా అనేక రంగాలలో మీడియా విస్తరించింది. కరోనా తర్వాత ప్రింట్ మీడియాకు వ్యాల్యూ పడిపోయింది. వెబ్, డిజిటల్ మీడియా విస్తృతి పెరిగిపోయింది. వాస్తవానికి మీడియాలో ప్రింట్ విభాగానికి కొంతలో కొంత హక్కులు ఉంటాయి. అందులో పని చేసే వారికి ప్రావిడెంట్ ఫండ్, శాలరీ, ఇతర సౌలభ్యాలు ఉంటాయి. మన దేశంలో కొన్ని పత్రికలు కార్మిక చట్టాలకు అనుగుణంగా పాత్రికేయులకు వేతనాలు చెల్లిస్తుంటాయి. కరోనా తర్వాత ప్రింట్ మీడియా నేల చూపులు చూస్తున్న క్రమంలో.. ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియాలు మరింత విస్తృతిని పెంచుకున్నాయి.
ఎలక్ట్రానిక్, వెబ్, డిజిటల్ మీడియాలో పనిచేస్తున్న వారికి అంతంత మాత్రమే వేతనాలు ఉన్నాయి. ఒక స్థాయి ఉద్యోగుల వరకే సరైన వేతనాలు, ప్రావిడెంట్ ఫండ్ వంటి సౌకర్యాలు లభిస్తున్నాయి. అయితే ఇటువంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం లేబర్ చట్టాలను తీసుకొచ్చింది.
డిజిటల్, ఆడియో, వీడియో వర్కర్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టులు, డబ్బింగ్ ఆర్టిస్టులు, స్టంట్ పర్సన్ లు పూర్తిస్థాయిలో లబ్ధి పొందే విధంగా లేబర్ చట్టాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. పై ఉద్యోగులు పనిచేస్తున్న సంస్థలు కచ్చితంగా వారికి నియామక పత్రాలు ఇవ్వాలి. గడువులోగా వేతనాలు చెల్లించాలి. అదనపు పనిగంటలు చేసిన వారికి రెండింతల జీతం చెల్లించాలి.
కరోనా సమయంలో వర్క్ ఫ్రం హోం అనే కల్చర్ వెలుగులోకి వచ్చింది. అయితే దీనిని కూడా కేంద్రం చట్టం చేసింది. ఈ కోడ్ లో భాగంగా యాజమాన్యం, ఉద్యోగి పరస్పర అంగీకారంతో పనిచేయవచ్చు. సేవారంగంలోనే దీనిని పొందుపరిచారు. కార్మిక చట్టాలను ఏకీకృతం చేసే విధానంలో భాగంగానే కేంద్రం 4 లేబర్ కోడ్ లు రూపొందించింది. ఇప్పటికే ఉన్న 29 కార్మిక చట్టాలను సవరించింది.
గిగ్ వర్కర్ల కోసం కేంద్రం సరికొత్త చట్టాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సార్వత్రిక సామాజిక భద్రత కవరేజ్ ను తప్పనిసరి చేసింది. చట్టబద్ధమైన వేతనాల చెల్లింపు, సకాలంలో ఇచ్చే విధంగా చట్టాన్ని రూపొందించింది. అగ్రిగెటర్లు వార్షిక టర్నోవర్ లో ఒకటి నుంచి రెండు శాతం వాటాను వర్కర్లకు అందించాల్సి ఉంటుంది.