Google : ప్రపంచంలోనే పెద్ద కంపెనీ అయిన గూగుల్ దగ్గర మన డేటా భద్రంగా ఉంటుందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజంగానే మన డేటా సేఫేనా ? లేకపోతే తెరవెనుక ఇంకేదైనా జరుగుతోందా ? గూగుల్ మనకు ఎన్నో యాప్స్‌ను, సర్వీసులను అందజేస్తుంది.. కానీ ఈ కంపెనీ మన పర్మిషన్ లేకుండానే మన డేటాను, లొకేషన్‌ను ట్రాక్ చేస్తుందట. ఈ విషయం బయటపడడంతో యూజర్లంతా ప్రైవసీ గురించి తెగ కంగారు పడిపోతున్నారు.
Also Read : పనికిరాని యాప్‌లకు ఎండ్ కార్డ్.. గూగుల్ ప్లే స్టోర్ ఇప్పుడు మరింత సేఫ్
గూగుల్‌కు భారీ షాక్.. వేల కోట్ల జరిమానా!
అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం గూగుల్‌పై కేసు వేసింది. యూజర్ల డేటాను చాటుగా కలెక్ట్ చేస్తోందని ఆరోపించింది. ఈ కేసు విచారణలో కోర్టు ఇప్పుడు గూగుల్ కంపెనీకి భారీ జరిమానా విధించింది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. గూగుల్ ఏకంగా 11 వేల 740 కోట్ల రూపాయలు (దాదాపు 1.375 బిలియన్ డాలర్లు) కట్టడానికి ఒప్పుకుందట. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తప్పుగా వాడుకున్నందుకే ఈ ఫైన్ వేశారు.
గూగుల్‌పై కేసు వేసింది ఎవరు? ఎందుకు?
2022లో టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్స్‌టన్ మొదట ఈ కేసు వేశారు. కంపెనీ పర్మిషన్ లేకుండా లొకేషన్ డేటా, ఇన్కాగ్నిటో మోడ్‌లో ప్రైవేట్ బ్రౌజింగ్ హిస్టరీ, అంతేకాదు ఫేషియల్ బయోమెట్రిక్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారాన్ని కూడా కలెక్ట్ చేస్తోందని ఆయన ఆరోపించారు. గోప్యతా చట్టాలను ఉల్లంఘించినందుకు గూగుల్ ఇంత పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వచ్చింది.
ఇలా జరగడం ఇదేం మొదటిసారి కాదు
టెక్సాస్ ఇంత పెద్ద యాక్షన్ తీసుకోవడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు మెటా కంపెనీ (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) ఫేషియల్ రికగ్నిషన్ డేటాను వాడినందుకు 1.4 బిలియన్ డాలర్లు (దాదాపు 11 వేల 980 కోట్లు) ఫైన్ వేసింది. అంతేకాదు, మరో కేసులో గూగుల్‌ను తప్పుగా వ్యాపారం చేసినందుకు కూడా 5 వేల 980 కోట్ల రూపాయల జరిమానా వేశారు.
Also Read : హోమ్‌వర్క్ నుంచి కథలు చెప్పేవరకు.. పిల్లల కోసం కొత్త గూగుల్ జెమినీ ఏఐ!