ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో పాటు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది జగన్ సర్కార్ 1,26,728 గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి ఆ ఉద్యోగాలను భర్తీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో వేల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కాయి.
అయితే వివిధ కారణాల వల్ల దాదాపు 16 వేల ఉద్యోగాల భర్తీ జరగలేదు. దీంతో ప్రభుత్వం మరోసారి ఆ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసి గత నెలలో పరీక్షలు నిర్వహించింది. అతి త్వరలో ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలు వెలువడనున్నాయని సమాచారం. కరోనా, లాక్ డౌన్ వల్ల ఖచ్చితమైన తేదీని ప్రకటించలేక పోయినా త్వరలోనే ఫలితాలు విడులవుతాయని అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇకపోతే ఈసారి మార్కులతో పాటు ర్యాంకులను కూడా అధికారులు ప్రకటించనున్నారని తెలుస్తోంది. 14 రకాల రాత పరీక్షలు జరగగా వేర్వేరు పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ర్యాంకును కేటాయించారని సమాచారం. తొలిస్థానం నుంచి చివరిస్థానంలో ఉన్న అభ్యర్థి వరకు అధికారులు పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థికి ర్యాంకులను ప్రకటించనున్నారు. ప్రభుత్వం ర్యాంకుల ఆధారంగానే పోస్టుల భర్తీ చేపట్టబోతుంది.
గత నెలలో జరిగిన గ్రామ, వార్ద్ సచివాలయాల పరీక్షలకు 10, 57,355 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే పరీక్షకు మాత్రం 7,69,034 మంది మాత్రమే హాజరు కావడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 11,162 గ్రామ, వార్డ్ సచివాలయాలు ఉన్నాయి.