రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను వర్షాలు గజగజా వణికిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాలు తగ్గి పరిస్థితులు మారుతున్న సమయంలో వాతావరణశాఖ రాష్ట్రంలో మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మధ్య బంగాళఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. కోస్తాంధ్ర జిల్లాలన్నింటికీ అతి భారీ వర్షాల రూపంలో ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.
అయితే రాయలసీమ జిల్లాలపై మాత్రం వర్షాల ప్రభావం తక్కువగా ఉంటుందని సమాచారం. అయితే కడప, కర్నూలు, అనంతపూర్, చిత్తూరు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు మత్స్యకారులు వేటకు దూరంగా ఉండాలని సూచనలు చేస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉందని చెబుతోంది.
వర్షాల నేపథ్యంలో జగన్ సర్కార్ అధికారులను అలర్ట్ చేస్తోంది. మరోవైపు కొన్ని రోజుల క్రితం కురిసిన భారీ వర్షాల వల్ల నిరాశ్రయులైన వారిని ఆదుకునే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేసింది. ప్రభుత్వం నుంచి వరదల వల్ల నిరాశ్రయులైన వారికి ఉచితంగా నిత్యావసర సరుకుల పంపిణీ జరిగేలా ఆదేశాలు జారీ అయ్యాయి. వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో అధికారులు వీటిని పంపిణీ చేయనున్నారు.
సీఎం జగన్ ఆదేశాల మేరకు అధికారులు లీటర్ పామాయిల్, 25 కిలోల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ ఉలిపాయలు, కిలో ఆలుగడ్డలు ఇవ్వాలని సూచనలు చేశారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో సరుకుల పంపిణీ వేగంగా జరగాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేసింది.