Kumbh Mela : మహా కుంభమేళా 2025 జనవరి 13న ప్రారంభమవుతుంది. ఇదొక చారిత్రక, మతపరమైన కార్యక్రమం. ఈ మేళ ప్రయాగ్‌రాజ్‌లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ సారి మహా కుంభమేళ జరగనుంది. అతి త్వరలో ఈ జాతర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా కుంభస్నానం చేసేందుకు లక్షలాది మంది భక్తులు, పర్యాటకులు ఇక్కడికి వస్తున్నట్లు సమాచారం. జనవరి 13 నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర ఫిబ్రవరి 26న ముగుస్తుంది. అయితే మీరు కూడా ప్రయాగ్‌రాజ్‌కి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారా? అయితే ఖచ్చితంగా కొన్ని ప్రదేశాలను చూట్టి రండి. ప్రయాగ్‌రాజ్‌లోని జాతరకు దగ్గరగా ఉన్న ప్రదేశాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం. వీటి వల్ల ఈ ట్రిప్ మీకు కచ్చితంగా గుర్తుండిపోతుంది.
త్రివేణి సంగమం
గంగా, యమునా, సరస్వతి అనే మూడు నదులు ప్రయాగ్‌రాజ్‌లోని అతి ముఖ్యమైన ధార్మిక ప్రదేశం అయిన త్రివేణి సంగమం వద్ద కలుస్తాయి. అయితే, ఇప్పుడు సరస్వతి నది అంతరించిపోయినట్లుగా చెబుతుంటారు. ఈ ప్రదేశం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే కుంభమేళా ప్రధాన ఆకర్షణ కూడా. నదుల సంగమ ప్రదేశాన్ని దగ్గరగా చూడటానికి ఇక్కడ పడవ ప్రయాణం కూడా అందుబాటులో ఉంది.
అలహాబాద్ కోట
అక్బర్ చక్రవర్తి ఈ కోటను 1583లో నిర్మించాడు. ఈ కోటలోని సరస్వతి బావి, పాటల్‌పురి ఆలయం, అశోక స్తంభాన్ని సందర్శించండి. కుంభమేళా సమయంలో ఈ కోట ప్రజలకు సగం తెరిచి ఉంటుంది.
హనుమాన్ దేవాలయం
హనుమంతుని శయన విగ్రహానికి ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని కుంభం సమయంలో ఆశీర్వాదం, ఆధ్యాత్మిక అనుభూతి కోసం తప్పక సందర్శించాలి. ఇక్కడి విభిన్నమైన వాస్తుశిల్పం చూడదగ్గదిగా ఉంటుంది. మీరు మహాకుంభ స్నానం చేయడానికి వెళితే, తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించండి.
యమునా, సరస్వతి ఘాట్
ఈ ఘాట్‌లు కుంభమేళాలో భాగంగా ఉన్నాయి. పవిత్రమైన ఆచారాలు, నిర్మలమైన పడవ ప్రయాణాల కోసం ఈ స్థలాన్ని సందర్శించండి. మీరు ఇక్కడ ఆరతికి హాజరైతే మంచి థ్రిల్ అనిపిస్తుంది. ఆధ్యాత్మిక అనుభూతి కోసం పడవ ప్రయాణం చేయవచ్చు.
అశోక స్తంభం
అశోక స్థంభం మౌర్య చక్రవర్తి అశోకుడు స్థాపించిన చారిత్రక స్తంభం. ఈ స్తంభంపై అశోకుని మత శాసనాలు రాసి ఉన్నాయి. ఇది భారతీయ చరిత్రలో ఒక ప్రత్యేక భాగం. మీరు పిల్లలతో కలిసి ఈ ప్రదేశాన్ని చూడటానికి వెళ్లండి.
ఇంతకీ ఎలా వెళ్లాలి?
హైదరాబాద్ నుంచి ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లడానికి ప్రతి రోజు ఒక రైలు అందుబాటులో ఉంటుంది. అదే దానాపూర్ ఎక్స్‌ప్రెస్. సికింద్రాబాద్ నుంచి ప్రతిరోజూ ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఇక ఈ రైలు ప్రయాగ్‌రాజ్, ప్రయాగ్‌రాజ్ రాంబాగ్ అనే రెండు స్టేషన్లలో ఆగుతుంది. ఇక్కడికి చేరుకోవడానికి దాదాపు 25 గంటల సమయం పడుతుంది. అయితే కుంభమేళా నేపథ్యంలో దేశవ్యాప్తంగా 1225 ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది.