Kenya Drought: ఆఫ్రికా ఖండంలోని కొన్నిదేశాల్లో మరోసారి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. తీవ్రమైన కరువు వలన అక్కడి ప్రజలకు తినేందుకు తిండి, తాగేందుకు నీరు కూడా దొరకడం లేదు. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని ఇతర దేశాలకు వలస పోతున్నారు. పుట్టిన ఊరు, సొంత ఇల్లు, అయినా వారిని వదిలేసి దూర ప్రాంతాలకు కాలినడకన వలస పోతున్నట్టు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఇకపోతే వన్యమృగాల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. తాగేందుకు నీరు, ఆహారం లభించక ప్రాణాలు కోల్పోతున్నాయి. ఎక్కడ చూసినా జంతువుల కళేబరాలే దర్శనిమిస్తున్నాయి.
కెన్యాను వెంటాడుతోన్న కరువు..
ఆఫ్రికా ఖండం అనగానే కరువు, పేదరికం గుర్తొస్తుంది. అక్కడి ప్రజలు తిండి కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూడాలి. పూర్తిగా ఏడారి ప్రాంతాలు దర్శనమిస్తాయి. పంటలు పండించడానికి అక్కడి నేలలు అనువైనవి కావు. ఒకవేళ ఉన్న నీరు లభించకపోవడంతో పంటలు ఎండిపోతాయి. దీంతో ఆఫ్రికా ఖండంలో జీవించే ప్రజలు ఎక్కువగా బతుకుదెరువు కోసం అభివృద్ధి చెందిన దేశాలకు వలస పోతుంటారు. అయితే, చీకటి ఖండంలోని కెన్యా దేశంలో తాజాగా తీవ్రవర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. గడిచిన సెప్టెంబర్ నెలలో సాధారణ వర్షపాతం కంటే అక్కడ 30 శాతం తక్కువ వర్షం కురిసింది. దీంతో అక్కడి జలశయాలు, నీటి వనరులు పూర్తిగా అడుగంటిపోయాయి. దీంతో తాగేందుకు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జంతువులు అయితే నీటి కోసం సుదూర ప్రాంతాలకు ప్రయాణిస్తూ మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నాయి.
ఒకేసారి ఆరు జిరాఫీలు మృతి..
కెన్యాలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో తాగు నీరు, ఆహారం లభించకపోవడంతో ఒకేసారి ఆరు జిరాఫీలు మృతి చెందాయి. వాటి కళేబరాలను ఫారెస్టు అధికారులు ఒకచోటుకు తీసుకొచ్చి పెట్టారు. డ్రోన్ కెమెరా ద్వారా తీసిన చిత్రాలను అంతర్జాతీయ మీడియా ప్రచురించడంతో అక్కడి దుర్బిక్ష పరిస్థితులను చూసి ప్రపంచం ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత కొంతకాలంగా కెన్యా ఈశాన్య ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడి కౌంటీలోని సబూలీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోని జంతువులు తాగేందుకు నీరు లేక అల్లాడుతున్నాయి. ఈ క్రమంలోనే నీటి కోసం వెతుకుతూ వెళ్లి ఎండిపోయిన రిజర్వాయర్‌లో బురదలో చిక్కుకుపోయి ఆరు జిరాఫీలు మృతి చెందాయి. అవి అప్పటికే ఆహారం లభించక బలహీనంగా మారిపోయాయి. బురదలో నుంచి బయటకు వచ్చే శక్తి లేక అందులోనే ప్రాణాలు వదిలాయి. అయితే, ఆ రిజర్వాయర్‌లో మిగిలిన కాస్త నీరు చెడిపోకుండా ఉండేందుకు చనిపోయిన జిరాఫీలను వేరే చోటుకు తీసుకొచ్చారు అధికారులు..
Also Read: Varun Singh: విషాదం.. కెప్టెన్ వరుణ్ సింగ్ మృతి.. తుదివరకు పోరాడిన వీరుడు?
చనిపోయిన జిరాఫీల కళేబరాలను చూస్తే ఎవరికైనా హృదయం తరుక్కుపోతుంది. ఈ పరిస్థితులు ఇలానే కొనసాగితే అక్కడి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న మరో నాలుగు వేల జిరాఫీలకు ప్రాణసంకటం తప్పదని అధికారులు చెబుతున్నారు. పెంచుకునే జంతువులకు మాత్రం మనుషులు తాగేందుకు నీరు, ఆహారం అందిస్తున్నారని, కానీ జంతు సంరక్షణ కేంద్రంలోని వేల సంఖ్యలోని వన్యప్రాణులకు ఎలా ఆహారం, నీరు అందించగలమని అధికారులు కూడా వాపోతున్నారు. ఇప్పటికే ఆ దేశ అధ్యక్షుడు ఊహురు కెన్యాట్టా అక్కడి కరువు పరిస్థితులను జాతీయ విపత్తుగా ప్రకటించారు.
Also Read: Modi Speaks: మోడీతో నేరుగా మట్లాడే ఛాన్స్.. వాస్తవ పరిస్థితి చెబుతారా?