IT Companies On Visakha: విశాఖ నగరానికి మహర్దశ పట్టనుందా? దిగ్గజా ఐటీ సంస్థలు రానున్నాయా? ఇటీవల సర్వేలో అదే తేలిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. నాస్కాం డెలాయిట్ అనే సంస్థ సర్వే చేపట్టింది. దేశవ్యాప్తంగా 26 నగరాల్లో ఐటి అభివృద్ధి చెందే అవకాశం ఉందని నిర్ధారించింది. అందులో తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖ టాప్ లో నిలిచింది. ఏపీ నుంచి విజయవాడ, తిరుపతి నగరాలు సైతం ఈ సర్వేలో గుర్తించబడ్డాయి. ఇది హర్షించదగ్గ పరిణామం.
వాస్తవానికి ఉమ్మడి ఏపీలోనే హైదరాబాద్ తర్వాత ఐటీ డెస్టినీగా విశాఖన ఎంచుకునేవారు. విభజన తర్వాత విశాఖ టాప్ వన్ పొజిషన్ లోకి వచ్చింది. గత ప్రభుత్వం ఐటి కి ప్రాధాన్యమిచ్చి.. దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు సైతం పూర్తిచేసుకుంది. కానీ వైసీపీ సర్కార్ వచ్చాక.. పురోగతి లేకుండా పోయింది. ఐటీ సంస్థలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిపోయిందన్న అపవాదు ఉంది. దీనిని అధిగమించాల్సిన అవసరం ఉంది.
వాస్తవానికి ఐటి అభివృద్ధికి విశాఖ నగరం ఎంతో అనువైనది. ఇప్పటికే మధురవాడలో ఐటీ హిల్స్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వం సైతం పాలనా రాజధానిగా విశాఖను ఎంచుకుంది. ఐటీ సంస్థల కోసం భారీగా ప్రభుత్వ స్థలాలు సైతం ఉన్నాయి. భారీ ఐటి హబ్ ఏర్పాటు చేయగలిస్తే ఐటీ సంస్థలు ఇబ్బడి ముబ్బడిగా విశాఖ చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి సిటీల్లో ఐటీ పరంగా పూర్తిస్థాయిలో విస్తరణ జరిగింది. వాటి తర్వాత దక్షిణాది రాష్ట్రాల్లో విశాఖ నగరమే కనిపిస్తోంది. ఇప్పటికే ఇన్ఫోసిస్ సంస్థ విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించింది. అదా నీ డేటా పార్క్ వచ్చింది. రహేజా గ్రూప్ సైతం విశాఖలో ఐటీ సెంటర్ ని ఏర్పాటు చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. వీటితోపాటు మరికొన్ని దిగ్గజ సంస్థలు సైతం తమ కార్యకలాపాలను విశాఖలో ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయి. తాజా సర్వేలో సైతం విశాఖలో మానవ వనరులు సులువుగా లభ్యమవుతాయని తేలడంతో మరిన్ని సంస్థలు విశాఖ వైపు చూసే ఛాన్స్ కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కాస్త చొరవ చూపితే విశాఖకు మహర్దశ పట్టినట్టే.