Tirumala: తిరుపతిలో అపచారం జరిగింది. ఆగమ శాస్త్ర నిబంధనలకు ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయ గోపురం మీదుగా విమానం ప్రయాణించింది.గతంలో సైతం ఇలానే విమానాలు రాకపోకలు సాగించాయి. ఇది ఆగమ శాస్త్రం నిబంధనలకు విరుద్ధమని టీటీడీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా.. విమానయాన శాఖ అధికారులు మాత్రం పెడచెవిన పెడుతూ వస్తున్నారు.
ప్రసిద్ధ ఆలయాల మీదుగా విమాన రాకపోకలు నిషిద్ధం. ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం విమానాలు వెళ్ళకూడదు. చాలా ఏళ్లుగా ఈ నిబంధన అమలవుతూ వస్తోంది. ఒకవేళ పొరపాటున విమానం రాకపోకలు సాగించినా.. భక్తులు దీనిని అపచారంగా భావిస్తారు. అయితే శ్రీవారి గోపురం మీదుగా రాకపోకలు సాగించిన విమానం.. రేణిగుంట విమానాశ్రయం నుంచి వచ్చిందా? లేక ఇతర ప్రాంతాల నుంచి వచ్చిందా? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ఆలయం మీదుగా విమానాలు ఎగురకుండా చూడాలంటూ రేణిగుంట విమానాశ్రయం అధికారులకు టిటిడి అధికారులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కానీ వారి పట్టించుకోవడం లేదన్న విమర్శ ఉంది.
తిరుమల నో ఫ్లై జోన్ కాదంటూ ఎయిర్ ట్రాఫికింగ్ అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. పైగా ఎయిర్ ట్రాఫిక్ పెరిగినప్పుడు తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదు అన్నట్లుగా ఏటీసీ అధికారులు వ్యవహరిస్తున్నారని టాక్ నడుస్తోంది. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండడంతో.. టిటిడి అధికారులు నో ఫ్లై జోన్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవడంతో.. ఇలా విమానాలు ఆలయ గోపురం పై రాకపోకలు సాగిస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి భక్తుల మనోభావాలను గౌరవించాలని విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి.