BJP – CM Jagan : గత ఏడాది కాలంగా వైసీపీ ముందస్తు ఎన్నికల వ్యూహం పన్నుతోంది. కానీ ఎన్నికలకు వెళ్లేందుకు మాత్రం సాహసించడం లేదు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ముందస్తు మాట వినిపిస్తూ వస్తోంది. కానీ తరువాత మరుగున పడుతోంది. ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకత, సంక్షేమ పథకాలకు ఆర్థిక ఇబ్బందులు వంటి వాటితో జగన్ ముందస్తుకు వెళ్లడమే ఉత్తమమని కొన్ని రోజులుగా విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ జగన్ ఏ నిర్ణయం తీసుకోవడం లేదు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామని మాత్రమే వైసీపీ నేతలు చెప్పుకొస్తున్నారు.
అయితే జగన్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవలసిన అనివార్య పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది. కేంద్రంలో బిజెపి ముందస్తుకు వెళ్లాలన్న ఆలోచనలో ఉందని ప్రచారం జరుగుతోంది. జమిలీ ఎన్నికల కోసం జనవరిలో ఎన్నికలు పెట్టాలనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి ఒడిశా,ఏపీపై పడింది. మరో ఆరు నెలల వ్యవధిలో ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఒకవేళ జమిలీ ఎన్నికలకు ఏకాభిప్రాయం కుదిరితే.. కేంద్రం డిసెంబర్,జనవరిలో ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. పనిలో పనిగా ఒడిస్సా,ఏపీలో సైతం ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. లేకుంటే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే కేంద్రానికి ఒడిశా సీఎం నవీన్ తన ఆమోదాన్ని తెలిపినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం జగన్ సైతం ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాము ముందస్తుకు వెళితే.. కలిసి రావాల్సిందేనని చెబితే.. జగన్ వెళ్లక తప్పదు. కాదు కూడదు అంటే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో జగన్ కు తెలియనిది కాదు. అందుకే బిజెపి నేతల మనసును గుర్తెరిగి వైసీపీ నాయకులు మసులుకుంటున్నారు. జమిలీ కి తాము సిద్ధమని ప్రకటనలు ఇస్తున్నారు. కానీ ముందస్తుకు వెళ్లబోమని ప్రకటించే సాహసం చేయలేకపోతున్నారు.
జమిలీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఏకాభిప్రాయ సాధన దిశగా ఆ కమిటీ కృషి చేస్తుందని కేంద్రం చెప్పుకొస్తోంది. కానీ దేశంలో ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం కుదిరే అవకాశాలు ఉండవు. ఆ విషయం వైసిపికి స్పష్టంగా తెలుసు. అందుకే జమిలీ కి తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు ఇస్తున్నారు. అదే భారతీయ జనతా పార్టీ ముందస్తుకు సిద్ధమైతే.. ఆ పార్టీ పిలుపునిస్తే.. జగన్ తప్పకుండా వెళ్లాల్సిందే. ఇందులో ఆయన సొంత అభిప్రాయానికి తావు లేదు.