
GHMC- Dogs: ఇల్లుకాలి ఒకడు ఏడిస్తే.. బీడీ వెలిగించుకునేందుకు నిప్పు అడిగినట్లు.. కుక్కలు కరిచి మనుషులు ఏడుస్తుంటే.. కుక్కలు లెక్కపెట్టి గుర్తింపు కార్డులు ఇస్తాం’ అంటోంది జీహెచ్‌ఎంసీ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయాలు ఒక్కోసారి చాలా విచిత్రంగా ఉంటాయి. సలహా ఎవరు ఇస్తారో తెలియదు కానీ.. నిర్ణయం మాత్రం తీసేసుకుంటారు. అవి జీహెచ్‌ఎంసీని నవ్వులపాలు చేసేలా ఉంటాయి. ఇందుకు తాజాగా కుక్కలకు ఐడీ కార్డులు జారీ చేయాలని తీసుకున్న నిర్ణయమే నిదర్శనం.
నివారణకు ఆదేశాలు..
గ్రేటర్‌తోపాటు శివారు మున్సిపాలిటీల పరిధిలో వీధి కుక్కల బెడదను నివారించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రస్తుతం 5.5 లక్షల వీధి కుక్కలున్నాయని, గతంలో 8.5 లక్షలు ఉండేవని, స్టెరిలైజేషన్ ఆపరేషన్స్ నిర్వహించడం వల్ల వాటి సంఖ్య 5.5 లక్షలకు తగ్గిందంటున్నారు అర్వింద్‌కుమార్. ప్రస్తుతం వాటికి కూడా ఏబీసీ(యానిమల్ బర్త్ కంట్రోల్) స్టెరిలైజేషన్ ఆపరేషన్లు నిర్వహించాలని, జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న హోటల్స్, రెస్టారెంట్స్, ఫంక్షన్ హాల్స్, చికెన్, మటన్ సెంటర్ల నిర్వాహకులు వ్యర్థాలను వీధుల్లో వేయకుండా కట్టడి చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. నగరంలో కుక్కలను నిరోధించడానికి తగిన చర్యలు చేపట్టాలని తెలిపారు.
వీధికుక్కల బెడద నివారించమంటే.. పెంపుడు కుక్కలకు ఐడీ..
వీధికుక్కలతో వేగలేకపోతున్నాం.. వాటిని నివారించాలని గ్రేటర్‌హైదరాబాద్ ప్రజలు కోరుతుంటే.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ మాత్రం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక యాప్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించిన ఫిర్యాదులను ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్, 040 21111111 ద్వారా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. నగర పరిధిలో, పరిసర మున్సిపాలిటీల పరిధిలో పెంపుడు కుకల సంఖ్యను గుర్తించడానికి త్వరలో మొబైల్ యాప్‌ను కూడా రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ యాప్‌లో సంబంధిత యాజమానులు నమోదు చేసుకోవాలని, తద్వారా గుర్తింపు కార్డు జారీ చేస్తామని పేర్కొంటున్నారు.

పెంపుడు కుక్కల గురించి యాప్, గుర్తింపు కార్డు ఇస్తామంటున్న అధికారులు వీధికుక్కల నియంత్రణపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. ఆపరేషన్ చేసి వదిలేస్తే అవి దాడిచేయకుండా ఉంటాయా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కుక్కలే కనిపించకుండా చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఎలా స్పందిస్తుందో చూడాలి.
