హైదరాబాద్లో కొద్దిరోజుల క్రితం వరదలు రావడంతో నగరవాసులు చాలా ఇబ్బందులకు గురయ్యారు. వీరిని అన్నివిధలా ఆదుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈక్రమంలోనే హైదరాబాద్లోని కొన్ని డివిజన్లలో ప్రభుత్వం 10వేల రూపాయాల చొప్పున వరద సాయం అందించింది. అయితే మరికొన్ని ఏరియాలో ఎలాంటి సాయం అందలేదని సమాచారం.
జీహెచ్ఎంసీకి ముందస్తు ఎన్నికలు రావడంతో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న వరదసాయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కోడ్ విధించింది. దీంతో వరదసాయం నిలిచిపోవడంతో బాధితులంతా కొద్దిరోజులుగా ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక డిసెంబర్ 7 నుంచి వరద సాయం అందించనున్నట్లు ఎల్బీ స్టేడియంలో జరిగిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. .
దీంతో బాధితులంతా వరద సాయం అందుతుందని నేడు మీసేవా సెంటర్లకు పెద్దసంఖ్యలో వెళ్లారు. ఉదయం నుంచి మీ సేవా సెంటర్ల ముందు పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వరదసాయంపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు.
వరద సాయం కోసం బాధితులు మీసేవా సెంటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రభుత్వమే నేరుగా నగదును బాధితుల అకౌంట్లలో జమ చేస్తుందని తెలిపారు. అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తాయని.. ఆధార్ కార్డులను అకౌంట్లతో అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు. కాగా కొన్నిచోట్ల మీ సేవ సెంటర్లు తెరువకపోవడంతో వరద బాధితులు ఆందోళనలు చేస్తుండటంతో నగరంలో ట్రాఫిక్ జామ్ అవుతోంది.