
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందిస్తున్నారు. అలాంటి వారిపట్ల ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో వైద్యులు వినూత్నంగా నిరసన తెలిపారు. ఎన్నోరోజులుగా వైద్యులకు పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్ (PPE) కిట్లు కావాలని వైద్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వారికి సరిపడా పీపీఈ కిట్లు అందించకపోవడంతో ఆగ్రహం చెందిన జర్మనీ వైద్యులు బట్టలు విప్పేసి నగ్నంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
కరోనా పేషంట్లకు పీపీఈ కిట్లు లేకుండా వైద్యం అందించడమంటే దుస్తులు విప్పి నిలుచున్నట్లేనని వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పీపీఈ కిట్లు అందించాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ పట్టించుకోకపోవడంతో గత్యంతరంలేక నగ్నం నిరసన తెలుపుతున్న వైద్యులు స్పష్టం చేశారు. ఈమేరకు ‘బ్లాంక్ బెడెంకెన్’ పేరుతో ఓ వైబ్ సైట్ ప్రారంభించి అందులో వైద్యుల బృందం తమ నగ్న చిత్రాలను పోస్టు చేసి నిరసన తెలిపింది. తమ దయనీయస్థితిని తెలిపేందుకే ఇలా చేసినట్లు వైద్యులు వివరించారు. వైద్యుల చర్యలతో ఉలిక్కిపడిన జర్మనీ ప్రభుత్వం వైద్యులందరికీ పీపీఈ కిట్లను, మాస్కులు, శానిటైజర్లు అందజేయనున్నట్లు హామీ ఇచ్చింది. ఈమేరకు వైద్యులు కొంతమేరకు శాంతించినట్లు తెలుస్తోంది.