Viral Video : ‘‘అత్యంత పవిత్రంగా పూజించే విఘ్నేశ్వరుని ప్రతిమలను చెత్త తరలించే వాహనాల్లో తరలించటమా? ఇది అత్యంత దుర్మార్గపు చర్య. వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజురోజుకూ అరాచకాలు మితిమీరుతున్నాయి.’’ అంటూ జనసేన శతఘ్ని సోషల్ మీడియా విభాగం ఒక వీడియోను పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో రోడ్డు పక్కన కొందరు వినాయకుడి విగ్రహాలను విక్రయిస్తున్నారు. అయితే.. ఓ అధికారితో కొందరు వ్యక్తులు గొడవ పడుతున్నారు. బహుశా.. అనుమతి లేకుండా ప్రతిమలను విక్రయిస్తుండొచ్చు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతి లేకుండా, రోడ్డుపై విగ్రహాలను విక్రయించడాన్ని అడ్డుకుంటున్నట్టుగా వీడియోలో కనిపిస్తోంది. అలా రోడ్డు పక్కన పెట్టి అమ్ముతున్న విగ్రహాలను.. అక్కడి నుంచి తరలిస్తున్నట్టు వీడియోను చూస్తే అర్థమవుతోంది. అయితే.. వాటిని తరలించడానికి చెత్త వాహనాన్ని ఉపయోగించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే.. ప్రభుత్వంపై రహదారుల ఉద్యమం మొదలు పెట్టింది జనసేన. ఇందుకోసం మూడు రోజుల ఆన్ లైన్ ఉద్యమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ‘‘జేఎస్పీ ఫర్ ఏపీ రోడ్స్’’ పేరుతో.. సోషల్ మీడియాలో దెబ్బతిన్న రోడ్ల చిత్రాలను పోస్టు చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. ఎవరి గ్రామాల్లో రోడ్లు దెబ్బతిన్నా.. ఈ నెంబర్ కు వాట్సాప్ చేయాలంటూ 76619 27117 అనే నంబర్ ను కూడా ఏర్పాటు చేశారు. దీంతో.. మూడు రోజులు ముగిసే సమయానికి.. దాదాపు 2.50 లక్షల ట్వీట్లను చేశారు జనసైనికులు. ఇవన్నీ చూస్తున్న వారు.. రాష్ట్రంలో రహదారుల దుస్థితి మరీ ఇంత అధ్వానంగా ఉందా? అని కామెంట్లు చేస్తున్నారు.
వీరి ఆన్ లైన్ ఉద్యమం ఆషామాషీగా ఏమీ సాగలేదు. రెండున్నర లక్షల ట్వీట్లతో.. ట్విటర్ ట్రెండింగ్ లో టాప్-5లో నిలిచింది. ప్రభుత్వం స్పందించి, తగిన చర్యలు తీసుకోకపోతే.. ఈ ఉద్యమం రోడ్లమీదకు వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు స్వయంగా పవన్ కల్యాణ్ అల్టిమేటం జారీచేశారు. ప్రభుత్వం స్పందించకపోతే.. తానే నేరుగా రోడ్లమీదకు వస్తానని హెచ్చరించారు. దీంతో.. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చలోకి రావడం.. చివరకు ముఖ్యమంత్రి జగన్ రోడ్డు సమస్యలపై స్పందించడం గమనార్హం.
ఇక, వినాయక చవితి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందంటూ బీజేపీ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మిత్రపక్షం జనసేన కూడా ఈ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేసింది. మరి, దీనిపై అధికారులు ఎలాంటి సమాధానం చెబుతారో?
అత్యంత పవిత్రంగా పూజించే విఘ్నేశ్వరుని ప్రతిమలను చెత్త తరలించే వాహనాల్లో తరలించటమా? ఇది అత్యంత దుర్మార్గపు చర్య. @YSRCParty ప్రభుత్వం హయాంలో రోజురోజుకీ మితిమీరిపోతున్న అరాచకాలు. pic.twitter.com/gt0Be7ef4d
— JanaSena Shatagni (@JSPShatagniTeam) September 6, 2021